పుట:AndhraKavulaCharitamuVol2.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్తారముగా నుపయోగించినవాడు శ్రీనాధుడు. ఆతని కవనరచనయందత్యాదరము కలవాడయి పెద్దన యాతని గ్రంధములను బలుమాఱు చదివి యొక్క చతుర్థాశ్వాసమునుదక్క దక్కినపుస్తకము నంతను, ఆతనివలెనే సంస్కృతపద భూయిష్ఠముగా రచియించి యుండుటచేత శ్రీనాథు డుపయోగించిన వాక్యములును గొన్ని మనుచరిత్రమునందు బడినవి. అంతమాత్రముచేత నీతనియందు గ్రంథచౌర్యము నారోపించుట న్యాయముకాదు. ఈత డొక్కడు మాత్రమేకాక యిటీవలి కవులనేకులు కొన్నిచోట్ల పూర్వకవుల వాక్యములను దమకబ్బములయందు జొప్పించియున్నారు. మఱియు నల్లసాని పెద్దనార్యుడు శ్రీనాథుని నైషధమునుండి కొన్ని వాక్యములను గ్రహించుటయేకాక యాతని పద్యములను జదివి యారీతి పద్యములనే పెక్కింటిని మనుచరిత్రమునందు గూర్చియున్నాడు. అందుకు నిదర్శనముగా నొకటి రెండుపద్యముల నిందు జూపుచున్నాను:-


సీ. నలినసంభవువాహనమువారువంబులు

కులముసాములు మాకు గునలయాక్షీ

చదలేటి బంగారుజలరుహంబులతూండ్లు

భోజనంబులు మాకు బువ్వబోడి

సత్యలోకముదాక సకలలోకంబులు

నాటపట్టులు మాకు నబ్జవదన

మధురాక్షరము లైనమామాటల వినంగ

నమృతాంధసులు యోగ్యు లనుమాంగి

భారతీదేవి ముంజేతి పలుకు చిలుక

సమదగజయాన సద్బ్రహ్మచారి మాకు

వేదశాస్త్ర పురాణాదివిద్య లెల్ల

దరుణి నీయాన ఘంటాపథంబు మాకు- [శృంగారవైషదము.ఆ.2]