పుట:AndhraKavulaCharitamuVol2.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని కాపాడిన దీసాళువ తిమ్మరుసే. ఈహేతువునుబట్టియే కృష్ణదేవరాయలు తిమ్మరుసు నప్పాజీ యని పిలుచుచుండుటయు సుప్రసిద్ధము.ఈమంత్రిశిరోమణి 1515 వ సంవత్సరమునందు రాజు కొండవీటి మీదికి దండెత్తినప్పుడు తాను సేనాపతిగానుండి సేనలను నడిపి కొండవీటిదుర్గమును జయించెను. ఈతడు కృష్ణదేవరాయలకంటె మూడుసంవత్సరములు ముందుగా ననగా హూణశకము 1527 వ సంవత్సరము నందు మృతినొందెను. తిమ్మరుసు బ్రాహ్మణుడనియు చిన్నతనములో మిక్కిలి బీదవాడయి విద్యలేక తిరుగుచుండెననియు చెప్పెడుకథ యొకటి కొంతకాలము నుండి పరంపరగా వచ్చుచున్నది. ఆకథయొక్క సత్య మెట్టి దయినను వినువారికి వినోదకరముగా నుండునని యెంచి యిందు సంగ్రహముగా వ్రాయుచున్నాను:-

"తిమ్మరుసు నియోగిబ్రాహ్మణుడు. ఈతడు బాల్యమునందే తల్లిదండ్రులను బోగొట్టుకొని నిరాధారుడై చదువును సంధ్యయులేక తిరుపతి సమీపమున పసులగాచి బ్రతుకుచు, పిమ్మట గుత్తికిబోయి యచ్చట బుల్లెలుకుట్టి కొంతకాలము జీవించి, తరువాత చంద్రగిరిలో గొంతకాలము మాధుకరవృత్తిచే దినములుపుచ్చి, అనంతరము పెనుగొండలో సత్రములో నుద్యోగము సంపాదించి తద్దుర్గాధీశ్వరుని తాంబూలపుతిత్తులు మోచి తదనుగ్రహమువలన గ్రమక్రమముగా వృద్ధినొంది గొప్పయుద్యోగములు సంపాదించి, కడపట తనబుద్ధిబలము వలన మంత్రిపదమును బొందెను. ఇతడు చిన్నతనములో తిరుపతి సమీపమున బసులను గాచుచు బడలి యొకనాటి మధ్యాహ్నసమయమున నొకచెట్టునీడను విశ్రమించెను. అంతట సూర్యుడు పశ్చిమమున వ్రాలుటచే సూర్యకిరణము లాతని మీదబడినను మెలకువరాక యతడు మైమఱచి గాడనిద్రను పొందుచుండుట చూచి యొక కృష్ణసర్పము చేరవచ్చి తనఫణమువిచ్చి యాచిన్నవాని ముఖమున