పుట:AndhraKavulaCharitamuVol2.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెండ సోకకుండ గొడుగువలె నడ్డముపెట్టెను. ఈయద్భుతచర్య నప్పుడు దారిపట్టిపోవుచున్న బట్టుమూర్తి యనుబట్రాజు చూచి యీతడు శీఘ్రకాలములోనే మహైశ్వర్యవంతుడు కాగలడని తెలిసికొని, సమీపమునకు బోగా సర్పమాతనీ విడిచి పాఱిపోయెను. ఆబట్రాజు తరువాత నా చిన్నవాడు మేల్కొనువఱకును వేచియుంచి లేచినతరువాత "అయ్యా! నీ కచిరకాలములోనే గొప్పయైశ్వర్యము పట్టును. అప్పుడు నన్ను మఱచిపోకుము" అని చెప్పి సెలవుగై కొని స్వగ్రామమునకు బోయెను. అటుపిమ్మట తిమ్మరుసు పయిని జెప్పినరీతిని క్రమక్రమముగా వృద్ధినొంది విద్యాబుద్ధులు సంపాదించి కొంతకాలమునకు మంత్రి పదము నొందెను. అప్పుడు బట్టుమూర్తి తిమ్మరుసు దర్శనార్థముపోయి యతడు తగినంత యాదరముచూపి గౌరవింపక యుపేక్షించుటచూచి,


శా. గుత్తిం బుల్లెలు కుట్టి, చంద్రగిరిలో గూ డెత్తి, పెంగొండలో

హత్తిన్సత్రమునందు వేడి, బలుదుర్గాధీశు తాంబూలపుం

దిత్తు ల్మోసి, పదస్థులైన ఘనులన్ దీవించ


అనునంతవఱకు బద్యము చెప్పునప్పటికి భయపడి తిమ్మరుసు తనకు గృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవసమయమునం దిచ్చిన పచ్చలపతకమును బట్టుమూర్తి మెడను వేసెను. అదియందుకొని యాబట్టు తక్కిన పద్యభాగము నీరీతిని బూరించెను - .........................................దీవించెదన్

మత్తా రాతియయాతి నాగమసుతు న్మంత్రీశ్వరుం దిమ్మనన్.

అనిచదివి యప్పుడే యీక్రింది పద్యమునుగూడ జెప్పెను:-


క. అయ్య ననిపించుకొంటివి| నెయ్యంబున గృష్ణరాయనృపపుంగవుచే

నయ్యా నీసరియేరీ| తియ్యని విలుకాడవయ్య తిమ్మరుసయ్యా.