పుట:AndhraKavulaCharitamuVol2.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. కడువిజాపురవరకామినీ గర్భముల్ భేదించు నెవ్వనిభేరిరవము
   దామిడి బోయి నిజాముపట్టణముల ధూళిగాజేయు నేదొరబలంబు
   గోలకొండవజీర్ల కోటులకాయముల్ చించు నేరాజేంద్రుచేతికత్తి
   సకల భూపాలకాస్థానసన్నుతి గాంచి వెలయు నేశూరునివిజయలక్ష్మీ
   యతడు కేవలనృపతియే యఘవిదూర
   చర్యు డాశ్రితరక్షావిచక్షణుండు
   జీర్ణ కర్ణాటభూపునర్జీవనుండు
   రమ్యగుణశాలి శ్రీరంగరాయమౌళి.

ఈనరపతివిజయము కవిత్వముకంటె జరిత్రమును జెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనదైనను, కవిత్వముకూడ రసహీన మయినదికాదు. కవిత్వరీతిని దెలుపుట కయి రామరాజీయములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను.


ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
   బమ్మిన జూతపోతనవపల్లవబింబఫలారుణాంబుజా
   తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
   కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.


చ. అతివిభవంబునన్ దితిసుతాహితరాజు మహాపరాక్రమో
   న్నతి మృగరాజు సోయగమున న్నలరాజు సమస్తధర్మప
   ద్ధతి నలధర్మరాజు పటుధైర్యమునన్ గిరిరాజు వాక్ప్రశ
   స్తత ఫణిరాజు నిర్దళితశాత్రవరా జగుబుక్క రాజిలన్.