పుట:AndhraKavulaCharitamuVol2.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.

గీ. సకలవిభు తిమ్మరాజుసేనలను ద్రుంచి
   గుత్తి పెనుగొండ మఱిగండికోట కంద
   నూలుపుర మాదవే నవలీల గెలిచి
   తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.

ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.


చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
   జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
   జ్వలనశిఖాసముత్కరముచందము నందమునొందె నెంతయున్
   సకలయ తిమ్మయప్రముఖశత్రుపురంబుల నెల్ల నారయన్.


ఈరామరాజుతండ్రియైన శ్రీరంగరాజు కృష్ణదేవరాయల తండ్రియైన నృసింహరాజునకు కర్ణాటకరాజ్యమును నిలుపుటలో సహాయుడుగా నుండినట్లు కానబడుచున్నది. ఈశ్రీరంగరాజుయొక్క శౌర్యము నరపతివిజయములో నీక్రింది పద్యమున వర్ణింపబడినది.