పుట:AndhraKavulaCharitamuVol2.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుచు నబ్బాలు ఱెప్పార్ప కెంతయును

గనుగొని వేడుకకడలి నోలాడి

యానందబాష్పంబు లాననాబ్జంబు

మైనుండి దిగువార మై గరుపార

బెన్నిధి గన్నట్టిపేదచందమున

నున్నతోన్నతు డైనయోగినందనుని

దనయులు లేని యాదరమున నెత్తి

కొని కూర్మితోడ నక్కున జేర్చి వేడ్క

గొనకొని యావేత్రకుంజంబు వెడలి

తనవార లెల్ల నెంతయు జోద్యపడగ

మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి

తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.

32. రాయసము వేంకటపతి


ఇత డారువేల నియోగి; అక్కయామాత్యుని కుమారుడు. ఈకవి తన వంశమువారిని వర్ణించుచు తమది వసిష్ఠగోత్ర మయినట్లీ క్రింది పద్యమునందు జెప్పెను -


శా. శ్రీల న్మించి సమస్త ధీకలనచే జెన్నొందు నార్వేలవం

శాలంకారకరుల్ వసిష్ఠమునిగోత్రాంకుల్ బుధు ల్దీనర

క్షాలీలం బొగ డొంది రందు వెలసెన్ సన్మాని భానప్ప ది

గ్జాలలోద్వేలవిశాలకీర్తుల సుధీసందోహమందారమై.


ఇతడు లక్ష్మీవిలాసమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించెను. "రసిజనహృదయంగమ సంగీతసాహిత్యకళాధౌరంధర్య" అని గద్యములో జెప్పుకొన్నదానినిబట్టి యీకవి సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును సమర్థు డైనట్టు కనబడుచున్నాడు.