పుట:AndhraKavulaCharitamuVol2.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడు శ్రీరంగరాయని యాస్థానమునందుండి యాతనివలన నగ్రహార రత్నాభరణాదులను బొందినట్టు లక్ష్మీవిలాసములోని యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.


మ అలఘుప్రాభవభవ్యు డాకుతపశాహామేయసైన్యంబు న

గల్గిక న్బాహులచేత గెల్చి బిరుదల్ గైకొన్న శ్రీరంగరా

యల చిత్తం బిగురింప రాయసము వ్రాయం జాలి తౌనౌ సుధీ

తిలకా యక్కయమంత్రి వేంకటపతీ దీవ్యత్కళావాక్పతీ.

ఉ. వ్రాయుచు రాజ్యవైభవ ధురంధరభూతి దలిర్ప గీర్తిధౌ

రేయసిరంగరాయమహిభృన్మణిరాయస మగ్రహారహై

మాయతరత్న భూషలు నృపాడ్యులు వర్తనలియ్య నుబ్బుచున్

వేయననేమి రాయసము వేంకటమంత్రియనన్ యశస్వివై.


ఈశ్రీరంగరాయలు వసుచరిత్రను కృతినందిన తిరుమలదేవరాయని కుమారుడు. ఇతడు 1534 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసినందున, కవియు నాకాలమునందే యుండినవాడు. లక్ష్మీవిలాసము సలక్షణమై మృధుమధురరచనను గలిగి యున్నది. కవితాశైలి జూపుట కయి గ్రంథమునుండి రెండు పద్యముల నుదాహరించుచున్నాను-


చ. తనదువిలాసహాసముల దాలిమి దూలగ రాగసాగరం

బున బలుమాఱు మారుదెస మున్గుచు దేలుచు నిచ్చ మెచ్చగా

మునుకొని వారితో భువనమోహిని యాకుహనావియచ్చరాం

గన పలికెం బికస్వరవికస్వరసుస్వరభాస్వరంబుగన్. [ఆ.3]


మ. హరికిం బట్టపురాణి వీవ యని కళ్యాణై కవాక్యస్తుతుల్

పరగం బుణ్యనదీనదోదకములం బట్టాభిషేకంబు చే

సిరినా నుజ్జ్వలహేమకుంభములచే జేత న్సుగంధాంబువుల్

హరిమధ్య ల్తగ నించి నించి జలకం బాడించి రబ్జాలయన్. [ఆ.5]