పుట:AndhraKavulaCharitamuVol2.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యయ్యదీక్షితు లప్పయదీక్షితులవారికి మేనల్లు డయి మధురరాజగు తిరుమలనాయకునియొద్ద మంత్రిగా నుండినందున, ఈతితుమలనాయకుడు మధురాపురము రాజధానిగా హూణశకము 1623 మొదలుకొని 1659 వ సంవత్సరమువఱకును పాండ్యదేశమును పాలించినందునను, ఆకాలమునుందుండిన యయ్యదీక్షితుల మేనమామయైన యప్పయ్యదీక్షితులవారు నూఱుసంవత్సరములక్రిందట కృష్ణదేవరాయలసభయందుండిరనుట నమ్మదగినదికాదు. అందుచేత దీక్షితులవారితోడిసమకాలికుడయిన రామకృష్ణకవియు కృష్ణరాయని యాస్థానమునందుండలేదనుట నిశ్చయము.

రామకృష్ణునిగూర్చి తాతాచార్యులవారితో సంబంధించినకథ లనేకములు చెప్పుచున్నారుగాన, దీక్షితులవారి చరిత్రమువలెనే యాచార్యులవారిచరిత్రమును మనకథతో నంతగా సంబంధించినది కాకపోయినను తాతాచార్యులవారినిగూర్చికూడ నిచ్చట గొంచెము వ్రాయుచున్నాను. ఈయనజన్మస్థలము కాంచీపురము; ఈతడు గొప్పవిద్వాంసుడును, సంస్కృతకవియు, ధర్మాత్ముడును అయి యుండెను. అప్పయ్యదీక్షితులవారు శివాంశచేత పుట్టిరని చెప్పినట్లే యితడు విష్ణ్వంశచేత గలిగెనని జనులు వాడుకొందురు. ఇతడు తనధనముతో బీదలకనేకవివాహములు చేయించినందున వీరివంశనామము తిరుమల వారయినను తరువాత కన్యాదానమువారని మాఱినది. ఈతడు గీర్వాణభాషలో "సాత్విక బ్రహ్మవిద్యావిలాసము" అనుగ్రంథమును జేసెను. ఇతడు చంద్రగిరిరాజులకు వంశగురువయి తఱుచుగా కాంచీనగరము నుండి చంద్రగిరికిబోయి వేంకటపతిరాయలసంస్థానమునందు వసించుటచేత, ఈయన కక్కడ రామకృష్ణకవితోడి సంబంధము కలుగుచు వచ్చెను. ఈతాతాచార్యులు మొట్టమొదట రామరాజు యొక్క రాజ్యాంతదశలో దలయెత్తి, వైష్ణవమతమునం దత్యంతాభినివేశము