పుట:AndhraKavulaCharitamuVol2.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి "శివార్చనచంద్రిక" "శివతత్త్వవివేకము", "శివమణిదీపిక" "ఆత్మార్పణము" మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన