పుట:AndhraKavulaCharitamuVol2.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలవాడయి తనశిష్యులయిన రాజులబలముచేత బలవంతముగా జనులను బట్టి చంక్రాంకణాదులు చేయుచువచ్చెను. అందుచేతనే "తాతాచార్యులవారిముద్ర భుజము తప్పినను వీపుతప్పదు" అనుసామెత నేటివఱకును వచ్చుచున్నది.

రామకృష్ణకవి యొక్క కాలమును నిర్ధారణము చేయుటకు దగిన యాధారములు కొన్ని తద్విరచితమైన పాండురంగమహాత్మ్యమునందే కనబడుచున్నవి. కవి యీక్రిందిపద్యములను కృతిపతియైన విరూరివేదాద్రియొక్క గురువునుగా కందాళ యప్పలాచార్యులవారిని వర్ణించి యున్నాడు.


సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్ఠు డభ్య స్తషడ్దర్శనార్థరాశి

యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత యఖిలపురాణేతిహాసకర్త

బంధురదివ్యప్రబంధానుసంధాత పంచసంస్కారప్రపంచచణుడు

వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి సకలదేశాచార్యనికరగురువు


పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ

గారిగర్భాంబురాశినీహారరశ్మి

సారసాహిత్యసర్వస్వశయ్యపేటి

యాళవందారు కందాళయప్పగారు.


వై జయంతీవిలాసమును రచియించిన సారంగు తమ్మకవియు నీకందాళ యప్పలాచార్యులవారినే తనగురువుగా విప్రనారాయణ చరిత్రముయొక్క ప్రథమశ్వాసమునం దీక్రిందిపద్యముచేత జెప్పియున్నాడు.


క. వందారు దాసజనతా

మందారు న్వేదశాస్త్రమహితప్రజ్ఞా

బృందారకగురు మద్గురు

గందాళాప్పలగురున్ జగద్ధితు గొలుతున్.