పుట:AndhraKavulaCharitamuVol2.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ. బలరిపుభోగ కాచనరపాలునిపెద్దకుమార మల్ల నీ

కలితయశ;ప్రభావములు కన్గొనలే కలకట్టు మన్నెమూ

కలు తల లొల్లరో బిరుదుగద్దియము ల్చదివించుకొందురౌ

కొలది యెఱుంగ జాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.


అను పద్యమును దనకవిచేత చదివించుకొనగా రాజులందఱును గోపించి యుద్ధ సన్నద్ధులయియున్నప్పుడు మల్కిభరాము వారివారించి ప్రశాంతులను జేసెనని యీవఱకే గంగాధర కవి చరిత్రమునందు వ్రాసియున్నాను. దీనినిబట్టి యీకవి యిబ్రహీము కాలములో నున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇబ్రహీము క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును గోలకొండరాజ్యమును పాలించెను. "కుమారమల్ల" యని పయిపద్యములో జెప్పబడి యుండుటచేత మల్లారెడ్డి యిబ్రహీముకాలములో కౌమారదశ యందుండి 1600 వ సంవత్సర ప్రాంతముల వఱకును జీవించియున్న ట్లూహించవలసియున్నది. ఈమల్లారెడ్డి కాపుకులజుడు; కాచరాజపుత్రుడు; గోదావరిమండలములోని బిక్కనవోలుసంస్థానప్రభువు. ఇతడు రాజమహేంద్రవరమును పాలించిన వీరభద్రరెడ్డి మొదలైన రెడ్లసంబంధుడని తోచుచున్నది. ఈతనికవిత్వము రసవంత మయి సలక్షణముగా నున్నది. ఈతని షట్చక్రవర్తిచరిత్రమునుండి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను-


సీ. గోపుర గోపుర గోపురప్రతిమంబు

కల్పద్రు కల్పద్రుగౌరవంబు

మానవ మానవ మానవాభిశయంబు

మణిజాల మణిజాలమంజిమంబు

సారంగ సారంగ సారంగనయనంబు

సుమనోబ్జ సుమనోబ్జశోభితంబు