పుట:AndhraKavulaCharitamuVol2.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంజయ! విధి నేమందును ?

గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్.

అని పూరించెననియు, రాజాతని సమయోచితబుద్ధికి సంతోషించి బహుమాన మిచ్చెననియు చెప్పుదురు. తెనాలిరామకృష్ణుడు రామరాజభూషణుని యొక్క కడపటి దినములలో నున్నవాడగుటచేత నిది సత్య మయినను కావచ్చును.

నరసభూపాలీయము రచియించిన కవి యెవ్వరయినను కృతిపతి రామరాజ తిరుమలదేవరాయలకు మేనల్లు డయిన నరసరాజు, ఈనరసరాజుయొక్క మాతామహుడయిన శ్రీరంగరాజునకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటపతి, అని యయిదుగురు కొడుకులును, లక్కమాంబ, ఓబమాంబ, కోనమాంబ అని ముగ్గురు కూతులును ఉండిరి. ఆ కొమార్తెలలో లక్కమాంబ కుమారుడయిన నరసరాజు కావ్యాలంకార సంగ్రహమను నరసభూపాలీయమును కృతి నొందెను; ఓబమాంబ కుమారుడయిన గొబ్బూరి నరసరాజు రామాభ్యుదయమును కృతినందెను; కోనమాంబ కుమారుడయిన తిమ్మరాజు పరమయోగివిలాసమును రచియించెను. వీనిలో నరసభూపాలీయము ప్రతాపరుద్రీయమునకు తెలుగు, నాటక ప్రకరణమును మాత్రము విడిచి ప్రతాపరుద్రీయము లోని లక్షణభాగమునంతను కవి తెనిగించినను లక్ష్యములను నరసభూపాలునిపేర గ్రొత్తగా రచించెను.

రామరాజభూషణుడు సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును మిగుల ప్రావీణ్యము గలవాడు. ఈతడు రచియించిన కృతులు కొన్ని యక్కడక్కడ నేటివఱకును పాడ బడుచున్నవి. ఒకవేళ వసుచరిత్రములో తిరుమలదేవరాయడు కవిగూర్చి "బహు సంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించితి" వన్న కృతులివియే యయి యుండునేమో!