పుట:AndhraKavulaCharitamuVol2.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరంగరాయడు క్రీస్తుశకము 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసెనట్టు కానబడుచున్నది. శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చినతరువాతను, ఇబ్రహీమ్‌షా మరణము పొందకమునుపును, యయాతిచరిత్రము రచియింపబడి యున్నందున, 1574 వ సంవత్సరమునకును 1581 వ సంవత్సరమునకును మధ్యకాలమునందు యయాతిచరిత్రము రచియింపబడినట్టు నిశ్చయముగా దెలియవచ్చుచున్నది. ఈ కవియొక్క శైలి మొదలైనవి మిక్కిలి చక్కగా నున్నవని యీ వఱకే చెప్పియున్నాను. శైలి తెలియుటకయి యయాతిచరిత్రములోని రెండు పద్యముల నిందుదాహరించుచున్నాను.


ఉ. పిన్నవుగాన నీవు కడుబ్రేముడి ముంగిటిలోన దిమ్మరన్

నిన్నబలెం దలంపబడు నీ విటనిల్చిన పెక్కులేండ్లు మా

కన్నును వాచు నీ మొగము గానక యెప్పుడు జూడ కున్న నా

యన్న యిదేటి కీతమక మారసిచూచిన వింతవాడవే- [ఆ.3]


ఉ. తొంగలిపువ్వుదేనియల దూకొని మత్తలి తుమ్మెదల్ పయిన్

బొంగుచు వ్రాల నొ ప్పెనగ బూచినపొన్న గడంగికాంచి మున్

మ్రింగినయావిసంబు వెస మీదికి బిచ్చిలు వేడికంటియా

జంగ మటంచు మ్రొక్కె నొకచాన నెలంతలు చూచి నవ్వగన్- [ఆ.4]