పుట:AndhraKavulaCharitamuVol2.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. రామరాజ భూషణుడు

రామరాజభూషణుడు వసుచరిత్రమను శృంగార ప్రబంధమును రచియించిన మహాకవి. రామరాజభూషణుడను నది రామరాజుయొక్క యాస్థానమందుండుటచేత వచ్చిన బిరుదునామమనియు నిజమయిన పేరు బట్టుమూర్తి యనియు చెప్పుదురు. ఇతని జన్మభూమి బట్టుపల్లెయను గ్రామము. ఈ గ్రామమును కృష్ణదేవరాయలు కవిత్వమునందు బ్రవీణులై ప్రబంధాంకమువారని బిరుదుపొందిన యీతని పూర్వులగు బట్టురాజుల కిచ్చెను. ఈబట్టుపల్లె బళ్ళారిమండలములోని పాలమండలమునకు సమీపమున నున్నదని యొకరును, కడపమండలములోని పులివెందల తాలూకాలో నున్నదని యొకరును వ్రాసియున్నారు. ఈ కవి కృష్ణదేవరాయల కాలములో బుట్టి యుండవచ్చును గాని యాతని యాస్థానమునందలి యష్టదిగ్గజము లనబడు కవులలో నొకడుమాత్రము కాడు. ఇతడు మొట్టమొదట 1542 వ సంవత్సరము మొదలుకొని 1565 వ సంవత్సరమువఱకును సదాశివరాయల పేర విజయనగరములో రాజ్యముచేసిన కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజు యొక్క యంతిమదశలో నతని యాస్థానమునందు బ్రవేశించి యాతని మీద గొన్ని చాటు ప్రబంధములను చేసి రామరాజభూషణుడని బిరుదు పేరొందెను. కాబట్టి యీతని కవిత్వము 1560 వ సంవత్సర ప్రాంతములయం దారంభ మయినదని చెప్పవచ్చును. ఈతడు రామరాజుయొక్క జీవితకాలములోనే యాతనిమీద కృతులు చెప్పినట్టు వసుచరిత్ర కృతినాయకుడయిన తిరుమలదేవరాయలు కవినిగూర్చి పలికిన యీ క్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.


శా. శ్రీరామక్షితిపుస్మదగ్రజు జయశ్రీలోలు నానాకళా

పారీణున్ బహుసంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించి త