పుట:AndhraKavulaCharitamuVol2.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిక్కము బంగరేచనృప నీవు రణస్థలి మోహరించినన్

బక్కున లోకముల్ పగిలిపాఱవె కూలవె దిగ్గజంబులున్.


ఈ యిభరామమల్కు (ఇజ్రహీమ్ మల్కు) క్రీస్తుశకము 1567 వ సంవత్సరమునందు రాజమహేంద్రవరముమీదికి దండెత్తి వచ్చి దానిని జయించి శ్రీకాకుళము వఱకునుగల కళింగదేశము నంతను స్వాధీనము చేసికొనెను. ఇతడు హూణశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, ఈతని యాస్థానకవియైన గంగాధరకవియు నాకాలమునందే యున్నవాడు. ఈకవికృత మయిన తపతీసంవరణము సరసమయిన దయి మంచి కల్పనలగలిగి దాదాపుగా వసుచరిత్రమునుబోలి వఱలు చున్నది. ఈతని కవిత్వధోరణిని దెల్పుటకై తపతీసంవరణములో నుండి రెండు పద్యముల నిందు జూపుచున్నాను.


ఉ. అక్కమలాక్షి హస్తములయందము నేమనివిన్నవింతు నే

నొక్కొకవేళ నక్కి పలయోష్ఠి సమీపమునందునున్నచో

జొక్కపుదమ్మిపూవు లనుచుం దరుణభ్రమరాళి వ్రాలు బెం

పెక్కినపల్లవంబు లనునిచ్చను డాయును గండుగోయిలల్. [ఆ.2]


మ. చివురుందామరపాకులన్ సలలితశ్రీఖండపంకంబులన్

నవనీహారజలాభిషేచనములన్ నాళీకపాళీమృణా

ళవితానంబుల మౌక్తికగ్రధితమాల్యశ్రేణులన్ బాలప

ల్లవతల్పంబుల శీతలక్రియలు చాలం జేసి రయ్యింతికిన్. [ఆ.3]