పుట:AndhraKavulaCharitamuVol2.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. పొన్నికంటి తెలగన్న

ఈతెలగనార్యు డచ్చతెనుగు గ్రంథములు చేసినవారిలో మొదటివాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భావనార్యుని పుత్రుడు. అచ్చతెనుగునందు గ్రంథములు రచియించుట మిక్కిలి కష్టము. ఈకవికి బూర్వమునం దెవ్వరును శుద్ధాంధ్రభాషలో ప్రబంధములు చేయుటకు ప్రయత్నించినవారైనను లేరు. ఇట్టిగ్రంథరచన కీతడు మొట్టమొదటివాడే యయినను, ఈకవి రచియించిన యయాతి చరిత్రము సర్వవిధములచేతను కూచిమంచి తిమ్మకవి రచియించిన యచ్చతెలుగు పుస్తకములకంటె శ్రేష్ఠతరముగా నున్నదని నాయభిప్రాయము. ఈయనకు బూర్వమునం దుండినకవులు కొందరు తమ కృతులలో నక్కడక్కడ నొక్కొక్క యచ్చతెలుగు పద్యమును వేయుచు వచ్చిరి. అట్టివానిని జూచియే జను లత్యాశ్చర్యపడుచుండిరి. ఈయంశము కృతిపతి యన్నట్లుగా యయాతి చరిత్రముయొక్క పీఠిక యం దీక్రిందిపద్యముతో జెప్పబడినది.-


ఉ. అచ్చ తెనుంగుపద్దె మొక టైనను గబ్బములోన నుండినన్

హెచ్చని యాడు చుందు రదియెన్నుచు బెద్దలు పొత్త మెల్లని

ట్లచ్చ తెనుంగున న్నొడువ నందులచంద మెఱుంగువారు నిన్

మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినున్.


ఈకవి తనగ్రంథము నమీనుఖానునకు కృతి యిచ్చెను, ఈ యయాతిచరిత్రముగాక యింకొక తెలుగు గ్రంథము మాత్రము మహమ్మదీయప్రభువున కంకితము చేయబడెను. అమీనుఖాను ఇభరాముశాయొద్ద కొలువున్నట్టు యయాతి చరిత్రములోని యీక్రిందిపద్యము వలన దెలియవచ్చు చున్నది.