పుట:AndhraKavulaCharitamuVol2.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నాడట. అందుచేత నతడు 1585 వ సంవత్సరమునకు దరువాత కూడ నల్పకాలము రాజ్యమేలి యుండును.

మఱియును కళాపూర్ణోదయములో కృష్ణరాజు తాతయైన నారపరాజును వర్ణించుచో నతడు కుతుబ్‌మల్కును కొండవీటివద్ద నోడించినట్లీక్రింది పద్యమునందు జెప్పబడినది.


చ. వదలక యుత్కలేంద్రుని సవాయి బరీదు నడంచుదుర్జయున్

గుదుసనమల్క దల్లడిలగొట్టె మహాద్భుతసంగరంబులో

నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం

పదపస నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్.


గోలకొండయందు కుతుబ్‌షావంశరాజ్య సంస్థాపకు డయిన యీ కుతుబ్ మల్కు క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలుకొని 1543 వ సంవత్సరమువఱకును గోలకొండయందు రాజ్యముచేసెను. కృష్ణదేవరాయని కాలములో కొండవీటివద్ద జరిగిన యీ యుద్ధము 1515 వ సంవత్సరమునందగుట చేత నాతనితో యుద్ధముచేసిన నారపరాజు మనుమడయిన కృష్ణరాజటు తరువాత ముప్పది నలువది సంవత్సరములైన పిమ్మట రాజ్యము చేసెననుట సత్యమునకు దూరమయి యుండదు. కాబట్టి దీనినిబట్టియు సూరకవి 1560 వ సంవత్సరప్రాంతముల యందున్నట్లు నిశ్చయింపవలసియున్నది. ఈవిషయమునే రాఘవపాండవీయములోని కృతిపతివంశానువర్ణనము నుండియు నొకవిధముగా నూహింపవచ్చును. రాఘవపాండవీయము కర్నూలు మండలములోని యాకువీటి సంస్థానాధిపతియైన పెదవెంకటాద్రి కంకితము చేయబడినది. ఆకువీడు కోవిలకుంటకు పడమట నాఱుకోసులదూరములో తుంగభద్రా తీరమునం దున్నది. అందు విరూపాక్షస్వామి దేవాలయమున్నది. ఈ వేంకటాద్రియొక్క తాతయైన యిమ్మరాజు రాజమహేంద్రవరమును జయించినట్లీ క్రిందిపద్యమువలన దెలియవచ్చుచున్నది:-