పుట:AndhraKavulaCharitamuVol2.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. రాజమహేంద్రవరాధిపు

రీజైత్రవిచిత్రముల బరిభ్రాజితుడై

యాజఘనుం డా యిమ్మ మ

హీజాని ప్రసిద్ధిగాంచె నెంతయు మహిమన్.


రాఘవపాండవీయ కృతిపతితాత యయిన యీ యిమ్మరాజును, కళాపూర్ణోదయ కృతిపతితాతైన నారపరాజును, కృష్ణదేవరాయని కాలములో నాతనికి లోబడిన సామంతరాజు లయి యుండి, ఆతనితో గలిసి సేనాధిపతులుగా మహమ్మదీయులు మొదలయిన వారితో యుద్ధముచేసిరని తెలియవచ్చుచున్నది. కృష్ణదేవరాయనికి సహాయులుగా నున్నవారిని వర్ణించిన కృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్య మీసంగతిని కొంత స్థాపించుచున్నది:-


సీ. కోటలు దుర్గముల్ గొనుచు దో:పటుబలధాటిచే మించునార్వీటివారు

కంటకాహితకంఠలుంటనోద్ధతలీల దంటలైతగు తొరగంటివారు

నిర్భరంబుగ శత్రునికరంబు నడగించి ధీరులైమించు గొబ్బూరివారు

చాలదోర్బలలీల నరదారిసంఘంబు దూలించివెలయు నంద్యాలవారు


నాదిగా గల్గురాజులు మేదురగతి

దుళువదొరలును బోయలు దురుసుగాగ

బ్రతిదినంబును ఘోరమౌ రణ మొనర్ప

నిలిచి పోరాడె గజపతి బలము లపుడు.


1515 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయలు రాజమహేంద్రవరమును జయించెను. కాబట్టి యిమ్మరా జాకాలమునం దాతనితో నుండి యుండును. దీనినిబట్టి చూచినను సూరనార్యునికాలము పయిని చెప్పబడినదే యయి యుండవలెను. ఈ యాకువీటిరాజులు విజయనగర రాజులకు లోబడినవా రయినందుకు నిదర్శనముగా రాఘవపాండవీయములో నుపోద్ఘాతములో నీ క్రిందివాక్యము కానబడుచున్నది: