కోన గుహల ప్రాంగణాలలో కూడ గణపతి కలడు (17, 21 వ చిత్రపతములు చూడుము), ఇచటి గణపతి ఆసీన రూపములో వున్నాడు. పాశ, అంకుశ, ఆహార బంతి, మోదకములను నాల్గు హస్తాలలో కలిగి పెద్ద ఉదరము కలిగియున్నాడు.
చండేశ లేక చండికేశ్వరుడు శివుని పరివార దేవతలలో ఒకడు (29, 30 వ చిత్రపటములు చూడుము). సాధారణముగా ఇతడు స్థానక లేక ఆసీన రూపములో రెండు హస్తములు కలవాడుగాను. ఆ హస్తములం దొకదానియందు 'టంక' లేక 'పరశు'ను కలిగి, రెండవ హస్తము అతని తొడపై వుండునట్లుగాను, కొన్ని సందర్భములలో తన భార్యయైన ధర్మనీతితో యుండునట్లు కూడ చూపబడుట గలదు. సామాన్యముగా శివ దేవాలయములందు నైవేద్యమును తొలుత చండికేశ్వరునికిచ్చి ఆ తరువాతినే శివునికిచ్చుట జరుగును. దీనికి శివుని ఆజ్ఞయే కారణమని, చండికేశ్వరుడు పొందిన వరమే కారణమని ఒక తథవము కలదు. అది ఏమనగా, శైనలూర్ అను వానికి పశువులు మేపుటకై పంపబడెను. కానీ ఇతడు పశుగ్రాస ప్రాంతమందు చిన్నచిన్న శివలింగములను ఇసుకతో రూపొందించి కొన్ని గోవుల పాలు పితికి ఆ లింగములపై పోయుచుండెను. ఒకనాడు అతని తండ్రి ఇది గమనించి కోపముతో ఆ లింగరూపములోని ఇసుకను తన్నుటకు ప్రయత్నించగా భక్తి పారవశ్యమున ఉన్న అతని పుత్రుడు కోపముతో తండ్రి కాళ్ళను గొడ్డలితో నరికివేసెను. ఇది గమనించి తన భక్తుని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై విచారశర్మను చండేశ్వర అను పేరుతో తన 'భూతగణము'లకు అధిపతిగా నియమించుకొని చండికేశ్వరునికి నైవేద్యము చేసిన తరువాతనే తనకు నైవేద్యము చేయవలెనని శివుడు ఆజ్ఞాపించెను. పార్వతీ సమేతుడుగా సోమస్కంద రూపుడైన శివుడు చండికేశ్వరుని శిరస్సును స్పృశించుచు పుష్పమాలను అలంకరించు రూపములోని ఒక శిల్పరూపమును మనము తంజావూరు జిల్లానందలి గంగైకొండ చోళపుర దేవాలయమందు గమనించవచ్చును. భైరవకోన గుహల ప్రాంగణాలలో కూడ చండికేశ్వరుడు గలడు (29, 30వ చిత్రపటములు చూడుము). ఇచటి చండీశుడు అసనరూపమున వున్నాడు. రెండు చేతులు గలవు. కుడిచేతిలో పరశు గలదు. ఎడమచేయి ఎడమతొడపై ఆన్చియున్నాడు. గుబురైన శిరోజాలను కలిగియున్నాడు. లావుపాటి మూడు వరుసలుగల యజ్ఞోపవీతమును ధరించియున్నాడు. సంహార రూపమున వున్నాడు ఎడమకాలు పద్మాసనములో ముడుచుకొని కూర్చొనియున్నాడు. కుడికాలు పైకిత్తి ముడుచుకొని పాదమును భూమిపై ఉంచియున్నాడు. కర్ణకుండలములను ధరించి, మెడలో దండను కలిగియున్నాడు. ఇచటి చండీశ శిల్పాలలో కొన్ని కొంత పరిపక్వ శిల్ప లోపమును కలిగియున్నవి. మరికొన్ని నైపుణ్యమైన శిల్పులచే రూపొందింపబడినట్లు తెలియుచున్నది.
చండీశ ఆరాధన శైవ సిద్ధాంతమున ఒక ప్రత్యేకస్థానమును కలిగియున్నది. ఒక మానవమాత్రుడు దైవత్వ స్థానమును పొందుట ఇందు మరువరాని అంశము, అరువది ముగ్గురు నాయన్మారులుగా గుర్తింపబడి యున్నప్పటికి చోళరాజ్యమందలి చేయింజలూర్ కు చెందిన యజ్ఞదత్త, భద్ర అను దంపతులకు జన్మించిన విచారశర్మ యనుబాలుడు మాత్రమే శైవ దేవగృహాలకు ముఖ్య అధిపతిగా శివునిచే నియమింపబడెను.
శివభక్తుడైన విచారశర్మ శివపూజకై ఉంచుకొన్న పాలపాత్రను తన తండ్రి తన్నినందుకు కోపముతో శివునికి అపచారము జరిగినదని తండ్రి కాళ్ళనే నరికివేయుటకు సిద్ధమగుట, ఇట్టి తరుణమున శివుడే ప్రత్యక్షమై అతని తండ్రికి కాళ్ళు వచ్చునట్లు చేసి, విచారశర్మను తన పుత్రునిగా దత్తత చేసుకొనెడి విషయము పురాణమున చెప్పబడి