పుట:AndhraGuhalayalu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గణేశ:

గణేశ్వరుడు శుభసూచనా నిలయుడుగాను, కోరిన వరములు తీర్చువాడుగాను భావింపబడుటచే భైరవకోనయందు ప్రాంగణమునందలి దేవకోష్ఠములలో ప్రతిష్ఠింపబడుటేగాక దాదాపు అన్ని దేవాలయాలలోను మనము గమనింపవచ్చును.

గణేశ లేక గణపతి హిందూమతమున ఒక ప్రముఖ దైవము ఇతనికే విఘ్నేశ్వరుడని పేరు. సాధారణముగా ప్రతి కార్యమునకు ప్రారంభమున ఇతనిని కొలుతురు. మలబారు ప్రాంతమందలి బ్రాహ్మణులలో ఒక తెగవారిని గణపతీయులని పిలుతురు. వీరు ఇతర దేవతలకన్నా గణపతినే ముఖ్యముగ కొలుతురు. విశ్వజ్ఞాన నిలయునిగా ఈ దేవుని హవెల్ భావించినాడు.

లింగపురాణమందు ఈ దేవుని పుట్టుక గూర్చి తెలుపబడియున్నది. ఒకానొకసారి అసురులు దేవతలను ఓడించిరి. దేవతలు శివునికి మొరపెట్టుకొనగా పరమేశ్వరుడు ఒక అసురుని సృష్టించి అతనికి విఘ్నేశ్వరుడని పేరిడెను. ఇతడు శివుని భూతగణాలకు నాయకుడయ్యెను. కాని శివపురాణమందు పార్వతీదేవి ఒక బాలుని సృష్టించి తన స్నానగది వద్ద కాపలా ఉంచెనని, శివుడు లోనికి ప్రవేశించుటకు ప్రయత్నించగా ఆ బాలుడు ప్రతిఘటించెనని, అందుచే శివుడు కోపోద్రిక్తుడై అతని శిరము ఖండించి వేసెనని, ఆ తరువాత పార్వతిచే ఆ బాలుడు సృష్టింపబడిన వాడని తెలుసుకొని దేవతలందరిని ఉత్తర దిశగా పయనించి వారు మొదట చూసిన ప్రాణి శిరస్సును తెచ్చి ఆ బాలుని మొండెమునకు అతికించవలెనని ఆజ్ఞాపించినాడని, దాని ఫలితముగనే విఘ్నేశ్వరుడు మనము చూచెడి రూపము కలిగియున్నాడని తెలుపబడియున్నది. అంతేగాక విఘ్నేశ్వరుని విధినిర్వహణకు ఎంతో సంతోషించి శివుడు విఘ్నేశ్వరుని తన భూతగణ నాయకునిగా చేసుకొనెను. ఇది శివపురాణమందలి వివరము.

ముద్గల పురాణమున గణపతియొక్క 32 రూపముల గూర్చి తెలుపబడియున్నది. శిల్పసార గ్రంథమున కూడా వీటిని కొన్నింటిని ప్రస్తావించబడి యున్నది సాధారణముగా గణపతి కూర్చొని లేక నిలుచొనినట్లు రూపొందింపబడి సమభంగ లేక అవిభంగ రీతిలో యుండును. గజశిరస్సు కలిగి తొండము ఎడమవైపుకు తిరిగియుండును. కొన్ని సందర్భాలలో కుడివైపుకు తొండముండును. ఇటువంటి సందర్భాలలో గణపతిని వలంబూరి వినాయక అందురు. సాధారణముగా ఇతడు రెండు నేత్రములనే కలిగియుండును. కాని ఆగమములు కొన్ని సందర్భాలలో మూడు నేత్రములుండవలెనని తెలిసియున్నవి, ఇతడు సామాన్యముగా నాలుగు చేతులను కలిగియుండును కాని 16 చేతులు కూడా కలిగి వాటిలో ఆయుధములను కలిగియుండుట కూడా కలదు. చేతిలో ఇతని ఆయుధాలలో పాశ, అంకుశములే గాక మోదక, ఆహార బంతి కూడా యుండును. పెద్ద ఉదరము కలిగి దానికి సర్పము చుట్టుకొనియుండుటచే ఇతనికి లంబోదరుడని పేరు కూడా కలదు. చిన్న ఎలుక వాహనము కలిగియుండును. ఇది పీఠము దగ్గరలో యుండును.

ఏకరూప గణపతి కూర్చొనిగాని, నిలుచొనిగాని యుండుటేగాక అనేక రకాలలో యుండును. తమిళులు గణపతిని పిళ్ళయ్యార్ లేక వినాయకర్ అందురు. ప్రతిచోట దేవాలయాలలో మనకగుపడును. గణపతి శుభసూచకముగను. వరములిచ్చువాడుగను భావింపబడుటచే ప్రతి గ్రామ మారుమూలలందును ప్రతిష్ఠింపబడియుండును.

ప్రసిద్ధిగాంచిన గణపతి దేవాలయాలలో తిరుచినాపల్లిలోని ఉచ్చిపిళ్ళయ్యార్ కోయిల్, నన్నిలం దగ్గరలోని తిరుచ్చెన్ గట్టన్ గుడి ముఖ్యమైనవి. తిరుచ్చెన్ గట్టన్ గుడిలో గణపతి మానవ శిరస్సు కలిగియున్నాడు. భైరవ