పుట:AndhraGuhalayalu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధారణంగా విష్ణువు చతుర్భుజాలు గలిగి వెనుక గల రెండు హస్తాలలో శంభు, చక్రాలను ధరించి, ముందు గల రెండు హస్తాలు అభయ. వరద ముద్రలలోను లేక కుడివైపు హస్తము అభయ (లేక వరద) ముద్రలోను, ఎడమవైపు హస్తము గద లేక పద్మమును కలిగియుండును. ఇతడు కిరీటమకుట, మకరకుండల, హార, రేయుర, కంకణ, ఉదరబంధ, కటిబంధ, యజ్ఞోపవీత మొదలగు ఆభరణాలను ధరించియుండును. కుడి వక్షస్థల భాగాన శ్రీవత్స అనెడి మచ్చ కలిగియుండును, దీని సమీపాన శ్రీలక్ష్మిని కలిగియుండును. అంతేగాక వైజయంతిమాలను, కౌస్తుభమణిని కూడా ధరించియుండును. సాధారణంగా ఇతని దేవీలయిన శ్రీలక్ష్మి, భూదేవి లేక పృధ్వి కూడ ఇతనితోబాటు యున్నట్లు చూపబడును. మరికొన్ని సందర్భాలలో నీలదేవికూడ చూపబడును.

విష్ణువు స్థానక, ఆసవ,శయన రూపాలలో యోగ, భోగ, వీర, అభిచారిక అనెడి 12 రకాలలో లేక ద్వాదశ మూర్తులుగా రూపొందింపబడి యుండును. స్థానక రూపమందే విష్ణువు ఎక్కువగా చూపబడును. ఆసవ రూపములో చూపబడినపుడు విష్ణువు ఆదిశేషునిపై ఆసీనుడై వున్నట్లు సాధారణముగా చూపబడును, ఆదిశేషుడు లేకుండా కేవలం ఆసనమూర్తి రూపంలో అతి అరుదుగా అగుపడును. శయనరూప విష్ణువు ఆదిశేషునిపై కుడివైపుకు వాలినట్లు శయనించి శిరస్సు కొద్దిగా దక్షిణముగా కలిగియుండును. కాని మామల్లపురం వంటి చోట్ల స్థలశయనస్వామి పేరుతో నేలపైననే పరుండినట్లు చూపబడియుండుట కూడ కలదు.

ఇక విష్ణు అవతారాలగూర్చి పరిశీలించినచో ఇతడు ముఖ్యంగా దశావతారములు కలిగియున్నట్లు తెలియుచున్నది. ఇతని అవతారాలగూర్చి పురాణాలు విపులంగా వివరించుచున్నవి. కొన్ని దశావతారాలగూర్చి తెలుపగా, భగవత్ పురాణము వంటి గ్రంథాలు విష్ణు అవతారాలు ఇరువదిరెండుగా తెలుపుచున్నవి. మరికొన్ని పురాణాలు మరి రెండింటిని చేర్చి మొత్తం ఇరువదినాల్గు అవతారాలుగా తెలుపుచున్నవి. అవి : మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన (త్రివిక్రమ), పరశురామ, రామచంద్ర (రఘురామ), క్రిష్ణ, బలరామ (లేక బుద్ధ), కల్కిపురుష, నారద, నారాయణ, కపిల, దత్తాత్రేయ, యాజ్ఞ, రిషభ, ప్రిథు, వేదవ్యాస, ధంవంత్రి, మోహిని, హయగ్రీవ అవతారాలు. ఈ అవతారాలలో విష్ణువు స్థానక రూపములో వుండి సాధారణంగా శంఖు (పాంచజన్యము). చక్రము (సుదర్శనము). పద్మము, గద (కౌమోదిక)లు కలిగియుండును. నందకం (sword), సారంగ (bow), బాణం (arrow), ఖేటక (shield) ములను కూడ కొన్నింటిలో ధరించియుండును. కాని విష్ణు సహస్రనామ గ్రంథమున వేయి అవతారాలగూర్చి తెలుపబడియున్నది. చెంగల్ పట్టు జిల్లాలో పలియశీవరం నందలి దేవాలయంలోను, తిరువేండ్రమందును మనము ద్వాదశ అవతారాల శిల్పాలను చూడవచ్చును.

భైరవకోనయందలి విష్ణు శిల్పము స్థానక రూపంలో గుహాలయాల ముఖద్వారమునకు కుడివైపు గల కుఢ్యభాగమున చెక్కబడియున్నది (27, 28 వ చిత్రపటములు చూడుము). ఇది కొంతవరకు సుందర పెరుమాళ్ కోయల్ నందలి స్థానక విష్ణుమూర్తి శిల్పమువలె వున్నది. భైరవకోన విష్ణువు చతుర్భుజములను కలిగియున్నాడు. కుడివైపున ఉన్న ముందుకు గల హస్తము అభయముద్రలో వున్నది. వెనుక హస్తమున చక్రము గలదు. ఎడమవైపు గల ముందు హస్తము వరదముద్రలో నున్నది. వెనుక ఉన్న హస్తమున శంఖు గలదు. ఈయన కిరీట మకుటము, మకరకుండలము, ఉదరబంధము, కటిబంధము, యజ్ఞోపవీతములను కలిగియున్నాడు. ఈయనకు ప్రభామండలము గలదు.