పుట:AndhraGuhalayalu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పబడుచున్నవి. బ్రహ్మకు ఆలయాలు నిర్మింపబడియుండుట అరుదుగా అగుపడును. బ్రహ్మకు పూజలు ఉండరాదని మోహినిచే శపించబడుటే ఇందుకు కారణము. ఈ విషయము బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడియున్నది. ఐననూ బ్రహ్మ ఆలయాలు కుంభకోణం, చిదంబరం, తిరువాడి, పుష్కర్ వంటి ప్రాంతాలలో నిర్మింపబడియున్నాయి. బ్రహ్మ సాధారణంగా ఆలయాల స్తంభాలపై చెక్కబడియుండును. శివాలయాల ముఖ్య దేవగృహ ద్వారమునకు ఉత్తరవైపున గల కుఢ్యభాగమున రూపొందింపబడి యుండును. శివుడు త్రిపుర అను రాక్షసుని వధించుటకు పోవునపుడు అతని రథచోదకుడుగా యున్నట్లు శివాలయాల రథాలలో బ్రహ్మ (కొయ్యతో) చెక్కబడియుండును. బ్రహ్మ నాభినుండి పుట్టిన తామరపుష్పమునుండి ఉద్భవించినట్లు వైష్ణవాలయాలలో బ్రహ్మ చూపబడియుండును. బ్రహ్మ (శిల్పమందు) స్తానక లేక ఆసీన రూపాలలో చతుర్ముఖుడై యుండవలెనని రూపమందన అనెడి గ్రంథమునందు తెలుపబడియున్నది. చతుర్ముఖము చతుర్వేదాలకు, నాల్గుదిక్కులకు చిహ్నమని అభిప్రాయము గలదు. తొలుత బ్రహ్మ పంచముఖుడనియు, శివుడు కోపముతో ఒక శిరస్సును ఖండించివేయుటచే నాల్గుశిరస్సులే మిగిలినవి తెలియుచున్నది. బ్రహ్మ చతుర్భుజుడు. ఇతడు చతుర్భుజుడు. ఇతడు సాధారణంగా కమండలము, అక్షమాల, సృవ, శ్రిక్, అజ్యస్థళి, పుస్తకము, కుర్చీలను తన రెండు పైచేతులలో ధరించియుండును. క్రిందవైపు కుడి, ఎడమ హస్తాలు సాధారణంగా అభయ, వరద ముద్రలలో యుండును. బ్రహ్మ ఎరుపుగా యుండునని విష్ణుపురాణము, సుప్రభేదాగమము తెలుపుచున్నవి. కాని శిల్పరత్న గ్రంథము బ్రహ్మ తెల్లగా యుండునని తెలుపుచున్నది కొన్ని సందర్భాలలో ఈయన గడ్డము, మీసాలను కలిగి శిరోజాలు జటామకుటముగా కలిగియుండును. ఈయన మజరకుండల, ఉదరబంధ. కడియాలు మొదలగు ఆభరణాలను ధరించియుండును. కొన్ని సమయాలలో ఈయన సరస్వతి లేక ఇరువైపులా సరస్వతి, సావిత్రి దేవీలను కలిగి ఏడు హంసలచే లాగబడుచున్న రథమందు పయనించుచున్నట్లు చూపబడియుండును.

కుంభకోణం, తిరువాడి, చిదంబరం, కండియూర్, మామల్లపురం, తిరువొత్తియూర్ లందు అద్భుతమైన బ్రహ్మ శిల్పాలు గలవు. కుంభకోణం దగ్గరలోని స్థానక బ్రహ్మ శిల్పములు గలవు.

భైరవకోనయందలి గుహాలయాల ముఖ్య దేవగృహ ద్వారాల ఉత్తరవైపు కుఢ్యభాగాలలో కూడా స్థానక బ్రహ్మ శిల్పము రూపొందించబడియున్నది ( 26వ చిత్రపటము చూడుము). ఇది కొంతవరకు కుంభకోణం బ్రహ్మ శిల్పమును పోలియున్నది. భైరవకోనలోని బ్రహ్మ నాల్గు హస్తములను, మూడు శిరస్సులను కలిగి స్థానకరూపమునయున్నాడు. కుడివైపు ముందు గల హస్తము అభయముద్రలో యున్నది. వెనుకహస్తమందు పుస్తకము కలదు. ఎడమవైపు ముందు గల హస్తము వరదముద్రలో యున్నది. వెనుకహస్తమందు అజ్యస్థలి (ghea pot) యున్నది. ఇతడు మకరకుండలము, ఉదరబంధము, చేతికడియాలు మొదలగు ఆభరణాలు ధరించియున్నాడు. జఠామకుటములో ఇతవి శిరోజాలు గలవు.

విష్ణు:

హిందూ మతమందు విష్ణువు ఒక ముఖ్యదైవము. వేదకాలమునుండి ఇతని ఆరాధన యున్నది. వేద కాలమున ఇతనిని సూర్యుడుగా కూడా భావించుట జరిగినది. ఋగ్వేదమున ఇతనిని రక్షకుడుగా, ప్రాచీనుడుగా కూడా ఆరాధించుట జరిగినది. ఇతిహాస పురాణకాలాలలో ఇతడు మరింత ప్రముఖ దేవుడుగా ఆరాధింపబడెను, ఆగమగ్రంథాలు ఇతని అనేక రూపాలనుగూర్చి వివరించుచున్నవి. వాటిలో వైఖానస ఆగమము, పంచరత్రాగమము, మాధవాచార్యుని తంత్రసారము, విష్ణుధర్మోత్తరము ముఖ్యమైనవి.