పుట:AndhraGuhalayalu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగమములుకూడా 108 శివనృత్యాలగూర్చి తెలుపుచున్నవి. భరతనాట్యమందలి అనేక నృత్యరీతుల అర్ధశిల్పాలు చిదంబరమందలి నటరాజ దేవాలయ తూర్పు ప్రవేశద్వారమువద్ద చెక్కబడియున్నవి.

మహేశ:

మహేశ శిల్పసార గ్రంథము ప్రకారము శివుని రూపాలు 16, కారణాగమ ప్రకారము 25. శివుని రూపాలన్నింటిని శాంత, అనుగ్రహ, సంహార, ఉగ్ర, నృత్య మూర్తులుగా ఐదు విభాగాలు చేయవచ్చును. శివుడు లేక మహేశ్వరుడు మానవాకారంలో స్థానక లేక ఆసనరీతిలో నాలుగు చేతులు కలిగియున్నట్లు చూపబడును. పై చేతులలో ఢంక,మఝులను కలిగి క్రిందివి అభయ,వరద ముద్రలలో వుండును. జటామకుటమున శిరోజాలు, వాటి ఎడమభాగాన అర్ధచంద్రుడు, కుడిభాగాన గంగాదేవి, సర్పము, అర్క పురుషులను కలిగియుండును. త్రినేత్రములు కలిగియుండును. పీతాంబరములనుగాని, జింకచర్మముగాని, పులిచర్మముగాని మోకాళ్ళవరకు ధరించియుండును. అతికొద్ది ఆభరణములను కలిగియుండును. సాధారణముగా శరీరమునకు, చేతులకు సర్పము చుట్టుకొనియుండును. ఎడమ చెవికి స్త్రీ ఆభరణమైన లంబపాత్రను, కుడి చెవికి పురుష ఆభరణమైన మకర కుండలాలను కలిగియుండును. కొన్ని సందర్భాలలో శివుడు అనేక శిరస్సులను, నాల్గుకన్న ఎక్కువ హస్తములను కలిగియుండును. మహా సదా శివుడు సుమారు 50 శిరస్సులను కలిగియుండగా ఊర్ధ్వనృత్యమూర్తి సుమారు 16 చేతులను కలిగి అనేక ఆయుధములను ధరించియుండును. ఇట్టి ప్రతిమలు మధుర, రామనాథ్, తిన్నవెల్లి జిల్లాలలోని పాండ్యుల దేవాలయ స్తంభములపై అగుపడును కాని నెల్లూరు జిల్లా మల్లాంలోని సుబ్రమణ్యేశ్వర దేవాలయమందలి మహా సదాశివుడు 5 శిరస్సులు, 16 చేతులు కలిగి అందు వివిధ ఆయుధములను ధరించియున్నాడు. బొంబాయికి 6 మైళ్ళ దూరంలోని ఎలిఫెంటా దీవి లోని క్రీ.శ 7వ శతాబ్దమునకు చెందిన రాష్ట్ర కూట కాలమునాటి గుహాలయమున ముదురు బ్రౌన్ శిల (sand stone) యందు ముఖ్య దేవగృహానికి ఎదురుగా (దక్షిణ కుఢ్యమున చెక్కబడిన) పెద్ద 18 అ॥ గల మూడు శిరస్సుల శివమహేశమూర్తి అర్ధ శిల్పము కలదు. ఇచటి శివమహేశమూర్తి ఎడమవైపు శిరస్సు భైరవ రూపమును, కుడివైపు శిరస్సు వామదేవ రూపమును, మధ్య శిరస్సు తత్పురుష శివరూపము కలిగియున్నాడు. భైరవ రూపము ఉగ్ర వినాశ శివ అవతారము. ఇందు శివుడు క్రూర మీస మూతి (cruel moustached mouth), కొర్కెపు ముక్కు (hooked nose), అలంకార శిరోవస్త్రము, సర్పము (ornamented head dress with cobra and deaths head)లను కలిగియున్నాడు వామదేవరూపము శివుని విశ్వదృష్టి అవతార చిహ్నము. This is an aspect (Siva) of creation with feminine features and blissful softness which is enhanced by the pearls and flowers in the hair and the lotus bud in the hand.

భైరవకోనయందు కూడా మహేశ అర్ధశిల్పము 4వ గుహాలయ గర్భగృహలోని శివలింగము వెనుకగల కుఢ్య ముఖభాగమున చెక్కబడియున్నది (24 వ చిత్రపటము చూడుము). ఇది ఎలిఫెంటా యందలి మహేశుని దాదాపు పూర్తిగా పోలియున్నది (24, 25వ చిత్రపటములు చూడుము) ఎడమవైపు శిరస్సు భైరవరూపమును, కుడివైపు శిరస్సు వామదేవ రూపమును, మధ్యశిరస్సు తత్పురుష రూపమును కలిగి, ఎలిఫెంటా మహేశుని వివరాలనే కలిగియున్నాడు.

బ్రహ్మ:

బ్రహ్మ అవతారమునకు సంబంధించి పురాణాలు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుచున్నవి. హిరణ్యగర్భ అను బంగారు గుడ్డునుండి ఉద్భవించాడనియు, విష్ణు నాభినుండి పుట్టిన తామరపుష్పమునుండి ఉద్భవించాడనియు