Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రేయోమార్గము కాదని గమనించి, శివకేశవా భేదరూప ధర్మాద్వైతమును నెలకొల్పి, ప్రజానీకమునకు ప్రబోధమొనగ సంకల్పించినాడు, తాను హరిహరనాథ రూప పరతత్త్వమును భావనచేసి, అద్వైతానుసంధానమున నారాధించి లోకమునకు ఉత్తమ మార్గదర్శియైనాడు.

తిక్కన కాలమునకు ముందే హరిహరనాథ విగ్రహము - తదర్చన బాదామి, హరిహర పట్టణము (కర్ణాటక రాష్ట్రం), భైరవకోనలోను హరిహరుల ఏకరూపమైన విగ్రహములున్నట్లు. 13వ శతాబ్దమునకు ముందు కాలమునకే చెందినట్లు తెలియుచున్నది. కాని హరిహరనాథుని నామరూపములు తిక్కనవలన ప్రచారము జరిగినదని చెప్పవచ్చును. నాచనసోముడు, వేంకటనాధుడు, గోపరాజు, కంభంపాటి నారపామాత్యుడు తిక్కన పద్ధతిని అనుసరించి శివకేశవ లక్షణ లక్షితునిగా వర్ణించి అతనికి తమ కృతులను అంకితమిచ్చిరి.

హరిహరుడు,నటరాజులు ఆలయాలకొరకు కాక శిల్పులు సరదాకు భైరవకోనలోని 3వ గుహాలయము ఎదుట ఉన్న బండలో చెక్కినట్లున్నది (12, 23వ చిత్రపటములు చూడుము).

T.N. Sreenivasan writes about Hariharamurthi (Sankranarayana) thus: This is also a combination image of Siva and Vishnu, as described in the Vamana Purana. As in case of Ardhanareesvaramurthi, the two halves have characteristics of Vishnu and Siva. Usually the image has four arms carrying Chakra on one side and Mazhu on the other side. The lower arms are in abhaya and varada poses. The famous temple at Sankaranarayana-koil is dedicated to this form of Siva and so also that at Harihar in Mysore". కాని భైరవకోనలోని హరిహరుడు ఎనిమిది చేతులను కలిగి వాటియందు ఆయుధములను కలిగియున్నాడు (12, 23వ చిత్రపటములు చూడుము).

నటరాజు:

భైరవకోనలోని మూడవ గుహాలయానికి ఎదురుగా సెలయేటికి అవతల ఒడ్డున పశ్చిమ ముఖముగా హరిహరుని ప్రక్కనే నటరాజ అర్ధశిల్పము గలదు (12, 23వ చిత్రపటములు చూడుము). నటరాజుకూడ హరిహరునివలె కర్ణకుండలములను ధరించి ఎనిమిది చేతులను కలిగి అందు ఆయుధములను ధరించియున్నాడు. నటరాజు వస్త్రానికి గీరలున్నవి. కుడివైపు గల నాలుగు హస్తాలలో ఒకటి అభయముద్రలోయున్నది. మిగిలిన మూడింటిలో డమరు, శూలము, ఖట్వంగములను కలిగియున్నాడు. ఎడమవైపు హస్తాలలో ఒకటి గజహస్తముద్రలో యున్నది మిగిలినని పాశ మొదలైన ఆయుధమునలు కలిగియున్నది. శిరస్సుపై కిరీట మకుటం గలదు. నడుముచుట్టూ సర్పము గలిగి ఎడమవైపుకు నటరాజు నడ్డి వంచియున్నాడు.

శివప్రతిమలను వాటి "గుణము"ల బట్టి స్థాపక, ఆసన విభాగాలుగా చేయవచ్చును. శివునికి సంబంధించి శయన రూపములు లేవు. శివుని రూపాలను శాంతమూర్తులు, అనుగ్రహమూర్తులు, సంహారమూర్తులు. ఉగ్రమూర్తులు, నృత్యమూర్తులు అను ఐదు విభాగాలుగా చేయవచ్చును. వీటిలో నృత్యమూర్తులు వృత్యరూపాలను కలిగియుండగా మిగిలిన మూర్తులందరూ స్థానక లేక ఆసన రూపమున వుండును.

శివునిగూర్చిన అధ్యయనంలో నృత్యరూపము చాలా ఆసక్తికరమైనది. భరతనాట్య గ్రంథమున 108 రకాల నృత్యముల ప్రసక్తి వున్నది. దీనినిబట్టి ఇవన్నియు శివుడు చేసెనని చెప్పవచ్చును. కానీ శివుని నృత్య రూపాలనన్నింటిని ఖచ్చితముగా తెలుపుట కషము.