పుట:AndhraGuhalayalu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క॥: నటులది దోరసముద్రము

విటులది యొర్గుల్లు కవిటి వినుకొండ,మహా
పుట లేదన మీ త్రితయము
విటఁ గూర్చెను బ్రహ్మ రసికులెల్లరు మెచ్చన్॥ (పుట 88)

దీని నాటక కర్త వినుకొండవాడని, నటులు బళ్ళాల రాజుల రాజధానియగు దోరసముద్రము (ద్వారసముద్రము) వారని ప్రదర్శన స్థానము భైరవకోన యవి తెలియుచున్నది

హరిహరుడు:

భైరవకోనలోని మూడవ గుహకు ఎదురుగా సెలయేటికి అవతలి ఒడ్డున పశ్చిమ ముఖముగా హరిహర నటరాజ అర్ధశిల్పములు గలవు (23, 12వ చిత్రపటములు చూడుము). ఇవి క్రీ. శ. 9వ శతాబ్దమునందు చెక్కబడినవిగా తెలియుచున్నది. హరిహరుని ప్రతిమ ఆనాటికే ప్రజ్వరిల్లియున్న మత ఉద్యమముల ప్రభావమును తెలుపుచున్నది. క్రీ.శ. 400-600 మధ్యకాలమున నయనార్లు శైవమత వ్యాప్తికి, క్రీ. శ. 5-6 శతాబ్దముల మధ్య ఆళ్వారులు వైష్ణవ మత వ్యాప్తికి భక్తి ప్రధాన సంకీర్తనలతో దేశమందు తిరిగి ప్రజలకు అర్ధమగు భాషలో భోధించి మతప్రచారము చేయసాగిరి పల్లవుల కాలము నాటికి ఈ భక్తితత్వం ప్రధాన స్థానంలో యుండి అన్ని మతముల ప్రభోదమునకు సమాన అవకాశములు గల్పింపబడెను. ఈ అన్ని మతముల లేక మత తెగల సమానత్వ భావమే మనకు భైరవకోనయందలి హరిహరుని శిలారూప రచన యందు అగుపడును. ఇచట హరిహర, నటరాజులు ఎనిమిది చేతులు కలిగి, ఆయుధములు ధరించియున్నారు. ఇవికూడ పల్లవుల కాలమునకు చెందినవి ఒక అభిప్రారము గలదు, వీరిద్దరు కర్ణకుండలములను ధరించియున్నారు. హరిహరుడు ఎత్తైన పల్లవరీతిలోని 'ఉష్ణిషను' కలిగియున్నాడు. హరిహరనాథ విగ్రహములు మహాబలిపురమందు. గంగైకొండ చో‌ళపురములందు కూడ కలవు. భైరవకోనలోని హరిహరుడు స్థానక ఆసనములో యున్నాడు. కుడివైపు నాలుగుచేతులలో ఒకటి అభయముద్రలో యున్నది. మిగిలిన మూడింటిలో ఖడ్గము, అక్షమాల, పరశులు గలవు. ఎడమవైపు గల నాలుగు చేతులతో ఒకటి కాట్యవలంబిత లేక కటి హస్త ముద్రలో యున్నది. మిగిలిన మూడింటిలో శంఖు చక్రములు కలవు. శిరస్సుపై కరండమకుటమును కలిగియున్నాడు. యజ్ఞోపవీతమును ధరించియున్నాడు. ఉదరము వరకు వస్త్రము ధరించియున్నాడు. ప్రభామండలము గలదు.

క్రీ. శ. 13వ శతాబ్దమువాడైన తిక్కన హరిహరనాధ సంబోధనలను పర్యాలోచించినచో కూడ శివకేశవ లక్షణ లక్షితమైన హరిహరమూర్తి విశేషము తెలియును. తిక్కనకు ముందే ఆళ్వారులు హరిహర స్వరూపములు రెండును ఒకటిగనే తెలిపిరి. దీనినే తిక్కన విపులముగా ప్రచారము చేసెను రామానుజులు వైష్ణవ మతమును, బసవేశ్వరుడు శైవమును ప్రచారము చేసిరి. శైవ, వైష్ణవ భేదములు సంఘమున మత విషయకమైన అనైక్యము వేరు తన్నుకొనబోవుతున్న కాలమున "ఆంధ్రావళి మోడముం బొరయు" నొక మహనీయమైన కార్యమును నిర్వహించుటకు నవతరించిన "కారణజన్ముడు" తిక్కన. శివకేశవ భేదమును తిక్కన నిరసించెను. ఇతనిది భేదములేని భక్తి. కావుననే మహాభారతమును హరిహరనాథునకు అంకిత మిచ్చెను. హరిహరనాథునుద్దేశించి శ్రీ మహా భారతమున తిక్కన 193 పద్యములు వ్రాసినాడు. తిక్కన అద్వైత వేదాంతమునందు నిష్ఠ కలిగియుండి జీర్ణించు కొనియుండినాడు. తిక్కన కాలము శైవ, వైష్ణవ మతములకు స్పర్ధయు, తత్తన్మతావలంబులలో పరస్పర విద్వేషమును ప్రబలి, సంఘము విచ్ఛిన్నమగు లక్షణములు అంతంత కధికము కాసాగినవి. అప్పుడు కవిబ్రహ్మ అది