పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గానేల చెప్పినన్నియు, సూనృతములు యోగదృష్టిఁ జూడుము తెలియన్.[1]

241


వ.

అనిన నమ్మునీంద్రుం డట్లకా వగచి మదనభూతావేశంబు మాని మానిని
దెలిపినం దెలివి నొంది నిరర్థకప్రయోజనంబునం దపోధనంబుఁ గోలుపోయితి
నని దుఃఖించుచు ప్రమ్లోచితో నిట్లనియె.[2]

242


క.

చపలాక్షి నీనిమిత్తము, తపమెల్లను నేగిఁ బోయెఁ దథ్యంబుగ నీ
యుపమ సురేంద్రుఁడు చేసిన, కపటము నీవింక తప్పు గలదౌదైనన్.[3]

243


తే.

ఇంతకాలంబు నాతోడ నెరవులేక, కూడియుండితి వటుగాన కోపమెల్ల
నుపశమించితి నీ వింక నుండవలదు, పొమ్ము పోకుండితేని యిప్పుడ శపింతు.[4]

244


క.

అని మొగము జేవుఱింపఁగఁ, గనుఁగవఁ గోపాగ్ను లొలుకఁగాఁ బల్కిన న
మ్మునియెదుర నిలువ భయపడి, తనువునఁ బెంజెమట లొదవఁ దరుణి వడంకెన్.[5]

245


వ.

ఇట్లు భయాకులితమానసయై గగనంబున కెగసి చనుచోఁ దనలేఁతచూలుగల
గర్భంబు స్రవించి శరీరంబునవయవంబులయందు నమ్మునివీర్యంబు స్వేదరూపం
బున నుద్గమించినం జలించి యాచంచలాక్షి బాలతరుపల్లవంబులఁ జెమటఁ
దుడుచుకొనుచు దేవలోకంబున కరిగె కంధమునీంద్రుండును నచ్చోటు వాసి
పురుషోత్తమతీర్థంబునకుం జని పరసతీసంగమదోషంబును జిరకాలం బనుష్ఠానలో
పంబైనపాపంబునుం బాయునట్లుగా బ్రహ్మపాఠస్తోత్రంబు లనుష్ఠించుచు నూర్ధ్వ
బాహుండై జనార్దను నారాధించుచుఁ దపంబు సేయుచుండె నంత నిట.[6]

246


క.

తరుపల్లవముల నమ్ముని, వరువీర్యము నిలిచి వాయువశమున నమృతో
త్కర మగునాకిరణంబులఁ, బరివృతమై యీలతాంగి ప్రభవించె నొగిన్.[7]

247


క.

మును కంధునకును బ్రమ్లో, చనకు సమీరునకు నాకు సాలంబులకున్
వినుఁ డొక్కరూప మారిష, యనఁబరఁగిన యీమృగాక్షి కతివలు సరియే.[8]

248
  1. సూనృతములు = సత్యములు.
  2. అట్ల కావ గని = అట్లె యగుట విచారించి, నిరర్థక ప్రయోజనంబునన్ = వ్యర్థమైన వ్యాపారముచేత, కోలుపోయితిని = పోఁగొట్టుకొంటిని.
  3. నేఁగిబోయెన్ = చెడిపోయెను, తథ్యంబుగన్ = నిజముగా, ఉపమ = ఉపాయము, తప్పుగలది = తప్పుగలదానవు.
  4. ఎరవు = భేదము, ఉపశమించితి = అణఁచితిని.
  5. జేవుఱింపఁగన్ = ఎఱ్ఱవాఱఁగా, కనుఁగవన్ = కన్నులజంటయందు, ఒలుకఁగాన్ = రాలఁగా, పెంజెమటలు = అధిక మైనచెమటలు, ఒదవన్ = కలుగఁగా.
  6. భయాకలితమానస = భయముచేత కలఁతనొందిన మనసుగలది, గగనంబునకున్ = ఆకాశమునకు, స్రవించి = (నీరై) కాఱి, శరీరంబునవయవంబులయందున్ = దేహముయొక్క అవయనములయందు, వీర్యంబు = రేతస్సు, స్వేదరూపంబునన్ = చెమటయాకృతితో, ఉద్గమించినన్ = పైకుబుకఁగా, బాలతరుపల్లవంబులన్ = లేఁతయైన చెట్లయందలి చిగురాకులచేత, బ్రహ్మపాఠస్తోత్రంబులు = వేదపాఠస్తోత్రములను, అనుష్ఠించుచు = చేయుచు, ఇట = ఇక్కడ.
  7. తరుపల్లవముల = చెట్లచిగుళ్లయందు, అమృతోత్కరము = అమృతరాశి, పరివృతమై = లెస్సగా ఆవరించఁబడినదై, ప్రభవించె = పుట్టెను, ఒగిన్ = క్రమముగా.
  8. సాలంబులకు = వృక్షములకును.