పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యివ్విధంబున నమ్మునివరుండు.

234


చ.

అది యొడఁబాటు లేక తను నాడుచునున్నఁ గడుం గలంగి య
మ్మదవతి శాపభీతి మఱుమాటలు వల్కక తాపసోత్తమున్
మదనకళావిలాసరసమగ్నునిఁ జేయుచుఁ దొంటికంటె నిం
పొదవఁగఁ బెక్కుకాల ముపయోగము చేసె రతిప్రసంగముల్.[1]

235


వ.

అంత నొక్కనాఁ డపరసంధ్యాసమయంబున నమ్మునీంద్రుండు పర్ణశాల వెడలి
నదీతీరంబున కరుగ నవలోకించి యెందుఁబోయెద వని యడిగిన ప్రమ్లోచికిఁ
గంధరుం డిట్లనియె.

236


శా.

సాయంకాలము వచ్చె నిప్పు డిదిగో సంధ్యాద్యనుష్ఠానముల్
సేయం బోయెద బ్రాహ్మణక్రియ లధిక్షేపించి వర్తించు ట
న్యాయం బన్న మృగాక్షి నవ్వుచు మహాత్మా యెన్నఁడు లేనిమీ
కీయుద్యోగము గల్గు టెట్లనిన మౌనీంద్రుండు దా నిట్లనున్.[2]

237


ఉ.

ఏ నిట నేటి రేపకడ నీనదిలోనఁ బ్రభాతకాలసం
ధ్యానియమంబు లెల్ల నుచితస్థితిమై నొనరించుచుండఁ గా
మానిని నీవు వచ్చి తిదె మాపటిసంధ్య యొనర్పఁ బోవఁగా
దీనికి నేల నవ్వితివి తెల్లము నా కెఱిఁగింపు నావుడున్.[3]

238


ఉ.

అచ్చపలాక్షి యిట్లనియె నాతనితోడఁ బ్రభాతకాలమే
వచ్చుటయు న్నిజంబు మునివర్య పితృప్రసు విప్పు డౌటయున్
బొచ్చెమునొంద దీనడుమఁ బోయినయేఁడులు తొమ్మనూటిపై
నచ్చుగ నేఁడు మీఁద నెల లాఱు దినంబులు మూఁడు నేఁటితోన్.[4]

239


మ.

అనిన న్నివ్వెఱఁగంది మౌని యిది మిథ్యావాదమో నిక్కమో
వనితా చెప్పుము నీవు నేను మదనవ్యాపారవారాశిలో
ననురాగంబున నుండు టేకదిన మైనట్లుండెఁ జూడంగ నీ
యనుమానం బుడిగింపవే యనిన నయ్యబ్జాక్షి తా నిట్లనున్.[5]

240


క.

మౌనీంద్ర నీవు బ్రహ్మ, జ్ఞానివి నీతోడ నా కసత్యము పలుకన్

  1. ఒడఁబాటు = సమ్మతి.
  2. అధిక్షేపించి = విడిచి, వర్తించుట = మెలఁగుట, ఉద్యోగము = ప్రయత్నము.
  3. రేపకడన్ = ప్రాతఃకాలమునందు, మాపటిసంధ్య = సాయంసంధ్య, తెల్లము = విశదముగా.
  4. ప్రభాతకాలము = ప్రాతఃకాలమునందు, పితృప్రసువు = సాయంసంధ్య, పొచ్చెము నొందదు = న్యూనతను పొందదు - అబద్ధము కా దనుట, అచ్చుగన్ = సరిగా.
  5. నివ్వెఱఁగంది = నిశ్చేష్టత్వమును పొంది, మిథ్యావాదమో = అసత్యపువాదో - నన్ను వంచించుటకై యిట్లు చెప్పెదవా యేమి యనుట, వారాశిలో = సముద్రమునందు.