పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెక్కఁగ నధరం బిచ్చుచు, నక్కమలదళాక్షి పలికె నమ్మునితోడన్.[1]

222


క.

మునినాథ యేను నిరతము, ననిమిషపతికొలువులంజియను సురపురికిన్
జనియెద నెన్నాళ్టైనను, నినుఁ గూడి రమింపఁ జెల్లునే నా కనినన్.[2]

223


ఆ.

ఇపుడు నీవు వచ్చి యించుకదడవు లే, దిట్టిసురతసుఖము లెల్ల విడిచి
పోవఁ జూచెదేనిఁ బుష్పాయుధునిచేత, భంగపడుదుఁ గాని బ్రతుకనోప.

224


ఆ.

అనిన నమ్మృగాక్షి యతనికామాతుర, భావ మెఱిఁగి యొండు పలుక వెఱచి
వేడ్క నతనిఁ గూడి వెండియు నూఱేడు, లర్థి సురతసుఖము లనుభవించి.

225


క.

ఒకనాఁ డమ్ముని తనతో, మకరధ్వజుకేళి దేలి మమకారమునన్
వికసిల్లుచున్నఁ గరములు, ముకుళించి ప్రియంబుతోడ ముద్దియ పల్కెన్.[3]

226


ఆ.

ఎంతకాలమైన నీరీతి మీతోడఁ, గలసి మదనకేళి సలుప నాకుఁ
దగదు లంజెఁగాని యొగి నీకు భార్యఁ గా, నది యెఱింగి నన్ను ననుపవలదె.

227


క.

అనుటయు నమ్ముని యిట్లను, వనజాయతనేత్ర నీవు వచ్చి ముహూర్తం
బును లేదు పోవఁ దమకిం, చిన నేమని నీకుఁ బ్రియము చెప్పుదు గరిమన్.[4]

228


ఉ.

ఇప్పుడు నామనోరథములెల్ల వితాకులవిత్తు చేసి యీ
తప్పులు వెట్టె దేమిటికిఁ దక్కఁ దలంచెద వెన్ని చెప్పినం
జెప్పుము కమ్మక్రొవ్విరులసెజ్జపయి న్నినుఁ గూడి యుండలే
నప్పుడె మంటమారికుసుమాస్త్రుఁడు నన్ బ్రదుకంగనిచ్చునే.[5]

229


తే.

అనిన కొండాడ వెఱచి యయ్యలరుబోఁడి, వలపు లేపార నిన్నూఱువత్సరములు
వెండియును పంచశరుకేళి విస్తరిల్లు, చుండి యమ్మునిఁ గనుఁగొని యొక్కనాఁడు.

230


ఆ.

కమలనయన మౌనిఁ గనుఁగొని యప్సరః, కాంత నగుట నమరకాంతుపురికి
నాకుఁ బోవవలయు నానతి యిమ్మన్న, నతఁడు మదనభూత మావహించి.[6]

231


క.

మగువఁ బ్రియోక్తులు పలుకుచు, బిగియంగాఁ గౌగిలించి బింబాధర మిం
పుగ నానుచు సిగ్గెఱుఁగని, తగులున నిట్లనియె మిగులఁ దమకం బొదవన్.[7]

232


ఉ.

మొల్లసుగంధి నామనసుమోహము నాఱడివెట్టి నీవు న
న్నొల్లక వీడనాడెద వయో తగవా మగవారిచిత్తముల్
వుల్లసిలంగఁ జేయఁ బొరపొచ్చెము లాడఁగ నాఁడువారికే
చెల్లును జెల్లఁబో వ్రతము చెడ్డ సుఖంబును దక్కదయ్యెఁగా.[8]

233
  1. చొక్కపు = నిర్దుష్టములైన, చొక్కించి = పరవశత నొందించి.
  2. నిరతము = ఎల్లప్పుడు, అనిమిషపతికొలువులంజియను = ఇంద్రునిసభయం దుండు బోగమదానను.
  3. మకరధ్వజుకేళిన్ = మన్మథక్రీడయందు, తేలి = విహరించి, మమకారమునన్ = మమత్వముచేత.
  4. తమకించినన్ = తమకపడినను.
  5. మనోరథములు = కోరికలు, వితాకులవిత్తు = నిశ్చేష్టతలకు బీజము - వ్యర్థము, తక్కన్ = మోసపుచ్చుటకు, క్రొవ్విరులసెజ్జ = క్రొత్తపూలపాన్పు, మంటమారి = మండిపడునట్టి స్వభావముగలవాఁడు.
  6. అమరకాంతుపురికిన్ = ఇంద్రునిపట్టణమునకు, మదనభూతము = మన్మథుఁ డనుదయ్యము, ఆవహించి = సోఁకి.
  7. తగులునన్ = ఆసక్తిచేత.
  8. మొల్లసుగంధి = మొల్లపూవులపరిమళమువంటిపరిమళముగలదానా (ఇది అనింద్యగ్రామ్యము), ఆఱడివెట్టి = వ్యర్థము చేసి, తగవా = న్యాయమా, వుల్లసిలంగన్ =ఉవ్విళ్ళూరఁగా, పొరపొచ్చెములు = భేదవాక్యములను, చెల్లఁబో = ఔరా.