పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మారిష యనుస్త్రీ పూర్వజన్మవృత్తాంతము

వ.

కావున వృక్షరక్షణార్థంబుగా నీమృగాక్షిం బాణిగ్రహణంబు సేయించెద
భవదీయం బైనభావికాలకార్యగౌరవంబునకు దీనిపూర్వజన్మప్రకారంబుఁ
జెప్పెద వినుండు.[1]

249


క.

తొల్లి యిది యొక్కధరణీ, వల్లభునిల్లాలు బాల్యవైధవ్యమునం
దెల్లసుఖంబులు విభవము, నొల్లక హరిఁ గొల్చుచుండె నున్నతభక్తిన్.[2]

250


క.

ఆపడతికిఁ బ్రత్యక్షం, బై పురుషోత్తముఁడు నిలిచి యంబుజముఖి నీ
వేపుణ్య ఫలముఁ గోరితి, వాపుణ్యఫలంబు నిత్తు నడుగుము ప్రీతిన్.

251


వ.

అనిన నక్కాంత లక్ష్మీకాంతునకు సాష్టాంగనమస్కారంబు చేసి దేవా నాకు
బాల్యవైధవ్యం బారోహించినకతంబునఁ గామభోగేచ్ఛ పెద్దయుం గలదని
మఱియును.[3]

252


ఆ.

మదనపరవశత్వ మొదవంగఁ బతిఁ గృప, సేయు మనుచు నమ్మృగాయతాక్షి
మదనగురునిఁ గదిసి పదిమాఱు లడిగిన, నతఁ డనుగ్రహింప నతివ చూచి.[4]

253


వ.

దేవా యివ్విధంబున వరంబు గృపచేసి పదుగురుపతుల నొసంగెదేని నే నయో
నిజనై జన్మించి ప్రజాపతిత్వంబు గలపుత్రునిం బడసి మహావిభవంబు లనుభవిం
చునట్టివరంబుఁ గృపసేయు మనిన నద్దేవుం డట్లకాక యని యనుగ్రహించి
యంతర్ధానంబు నొందె నయ్యింతి యీజన్మంబున నిక్కాంతయై జన్మించె దీని
మీరు పరిగ్రహంబు సేయునది మీకు దీనియందు మహాభాగుండును నతివీర్య
పరాక్రముండును బ్రజాపతిగుణోపేతుండు నైనపుత్రుండు జన్మించు వాఁ
డనేకవంశంబులకుఁ గర్త యై చరాచరంబులు నిర్మింప సమర్థుం డగునని
సోముండు ప్రచేతసులకు మారిషం బాణిగ్రహణంబు సేయించె నంత.[5]

254


క.

ఆరాజన్యతనూభవు, లారమణిఁ బరిగ్రహించి రాసతివలనన్
నీరజభవనిభుని మహో, దారునిఁ బుత్రకునిఁ గనిరి దక్షుం డనఁగన్.[6]

255


వ.

ఆదక్షప్రజాపతివలన దేవదానవగరుడగంధర్వసిద్ధవిద్యాధరాదినానాభూతంబు
లును ద్విపదచతుష్పదాదినానాజంతుజాతంబును బుట్టె ననిన మైత్రేయుం
డిట్లనియె.[7]

256
  1. భావికాలకార్యగౌరవంబునకు = రాఁగలకాలమాన (జరగవలసిన) పనుల యొక్క గురుత్వమునకు.
  2. ధరణీవల్లభునిల్లాలు = రాజుభార్య, బాల్యవైధవ్యమునన్ = పసితనమునందే ముండమోయుటచేత.
  3. ఆరోహించిన = ఎక్కిన - కలిగిన యనుట.
  4. పరవశత్వము = పరాధీనత్వము, కదిసి = చేరి.
  5. పరిగ్రహంబు సేయునది = భార్యగాఁ జేసికోవలసినది, మహాభాగుఁడు = గొప్పమహిమ గలవాఁడు.
  6. రాజన్యతనూభవులు = రాచకొమారులు, నీరజభవనిభుని = బ్రహ్మను పోలినవానిని, ఉదారునిన్ = తిన్ననిమనసు గలవానిని.
  7. ద్విపద...జాతంబును = రెండుకాళ్లు గలమనుష్యులు నాలుగుకాళ్లు గలమృగములు మొదలుగాఁ గలిగిన అనేకములైన ప్రాణిసమూహమును.