పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అజునిదక్షిణాంగుష్ఠంబునందు దక్షుఁ, డవతరించి నవబ్రహ్మలందు నొక్కఁ
డై తనర్చె నతండు ప్రచేతసులకుఁ, దనయుఁడై పుట్టు టేమివిధంబు చెపుఁడ.[1]

257


వ.

అనినం బరాశరుం డిట్లనియె బ్రహ్మమానసపుత్రుం డైనదక్షప్రజాపతి మహాత
పోధనుండు గావున నతనికి నెన్నండునుఁ గల్పంబులు లేవు. సృష్ట్యర్థంబుగాఁ
బ్రతిమన్వంతరంబునందును యుగంబుల నొక్కొక్క ప్రజాపతి దక్షనామంబున
జన్మించి సృష్టికిం గర్తయై యుండుఁ గావునఁ బ్రచేతసపుత్రుం డైనదక్షునిచరి
త్రంబు విస్తరంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.[2]

258

ప్రచేతసపుత్రుం డగుదక్షునిచరిత్రము

ఉ.

అక్షయపుణ్యమూర్తియు సమంచితకీర్తియు నైనయట్టియా
దక్షుఁడు పెద్దకాలము ముదంబున ఘోరతపంబు పుండరీ
కాక్షునిఁ గూర్చి చేసి సచరాచరభూతగణైకసృష్టికిన్
దక్షుఁడుగా వరంబుఁ గొని తామరచూలియనుజ్ఞ పెంపునన్.[3]

259


ఉ.

కిన్నరసిద్ధసాధ్యమునిఖేచరరభూచరదేవదైత్యులం
బన్నగమానవాలి మృగపక్షుల మానససృష్టియందుఁ దా
వన్నియగా సృజింప బహువంశపరంపరలం బ్రవృద్ధి లే
కున్న నతండు వేసఱి పయోరుహగర్భునిచే నియుక్తుఁడై.[4]

260


వ.

మిథునకర్మంబుచేతఁగాని ప్రజావృద్ధి లేదనుచుఁ దలంచి వరుణప్రజాపతిపుత్రి
యైనయసిక్ని యనుదానిం బాణిగ్రహణంబు చేసి దానియందు హర్యశ్వు
లనుపంచసహస్రసంఖ్యలం గలకుమారులం బడసి వారల నందఱఁ బ్రత్యేకంబ
ప్రజాపతు లగునట్లుగా నియమించిన నారదుండు విఘ్నంబు సేయం దలంచి
వారిపాలికి వచ్చి యిట్లనియె.[5]

261


క.

జలజభవాండము సర్వముఁ, గలయంగాఁ జూచి దేశకాలక్రమముల్
దెలియక ప్రజఁ బుట్టింపం, దలఁచుట మీకెల్ల వెఱ్ఱితన మౌఁ గాదే.[6]

262
  1. అజునిదక్షిణాంగుష్ఠంబునందు = బ్రహ్మయొక్క కుడిబొటనవ్రేలియందు, అవతరించి = జనించి, తనర్చెన్ = ప్రసిద్ధినొందెను.
  2. కల్పములు = ప్రళయములు - నశించుటలు, సృష్ట్యర్థంబుగా = సృష్టికొఱకు, ఆకర్ణింపుము = వినుము.
  3. అక్షయపుణ్యమూర్తి = తఱుగనిపుణ్యమే స్వరూపముగాఁ గలవాఁడు, సమంచితకీర్తి = ఒప్పిదమయిన కీర్తి గలవాఁడు, పెద్దకాలము = చిరకాలము, దక్షుఁడు గాన్ = చాలినవాఁడు అగునట్టు, తామరచూలి = బ్రహ్మ.
  4. ఖేచర = ఆకాశమునందు తిరుగునట్టివారును, భూచర = భూమియందు తిరుగునట్టివారును, పన్నగమానవాలి = పాములయొక్కయు మనుష్యులయొక్కయు సమూహము, మానససృష్టియందున్ = తలంపుననే సృజియించుటయందు, వన్నియగాన్ = ప్రశస్తముగా, ప్రవృద్ధి = అభివృద్ధి, వేసఱి = ఉత్సాహము చెడి, పయోరుహగర్భునిచేన్ = బ్రహ్మచేత, నియుక్తుఁడై = నియోగించఁబడినవాఁడై - నియమింపఁబడినవాఁడై.
  5. మిథునకర్మంబుచేత = దంపతులకూటమిచేత, పాణిగ్రహణంబు చేసి = పెండ్లియాడి.
  6. జలజభవాండము = బ్రహ్మాండము, కలయంగాన్ = కడవెళ్ళ.