పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని చెప్పి నారదుండు వోయె వారలందఱు నన్నిదిక్కులకుం బోయి సముద్రంబు
ప్రవేశించినయేఱులచందంబున మరల నెఱుంగకపోయిరి. దక్షుండు వెండియు
వైతరణియందు వేవురుకొడుకులం బడసి వారికి శబళాశ్వు లనునామధేయం
బులు చేసి పూర్వప్రకారంబునఁ బ్రజాపతిత్వంబునకు నియమించిన నారదుండు
వెండియును వచ్చి తొంటిహర్యశ్వులం బలికినయట్ల పలికి పోయిన.[1]

263


ఆ.

అప్పు డతనిమాట లగుఁగాక యని వార, లగ్రజను లరిగినట్ల యరిగి
మరల కెందుఁబోయి మడిసిరో నేఁడును, దెలియ నలవిగాదు దివిజులకును.[2]

264


వ.

అది కారణంబుగా నాటనుండియు.

265


క.

పరదేశము చరియింపఁగ, నరిగినయగ్రజుల వెదక ననుజన్ములు వో
యిరయేని వారు వారును, మరలక యెందైనఁ బోయి మడియుదు రనఘా.[3]

266


వ.

ఇవ్విధంబున దక్షుండు నష్టసంతానుండై నారదునిం గోపించి వెండియుఁ
దనభార్య యైనవైతరణియందు నఱువండ్రుకన్నియలం బుట్టించె వారియందుఁ
బదుండ్ర ధర్ముండును, పదుమువ్వురఁ గశ్యపప్రజాపతియును, ఇరువదియేడ్గురఁ
జంద్రుండును, నలుగుర నరిష్టనేమియు, ఇరువుర బహుపుత్రుండును, ఇరువుర
నంగిరసుండును, ఇరువురఁ గృతాశ్వుండును వరియించి రందు.

267


తే.

ధర్మపత్నులు పదుగురు ధర్మమతులు, వారు హరిఁ గూర్చి తపము పెంపారఁ జేసి
వివిధసంతానవతులైరి విప్రముఖ్య, వినుము నీ కవ్విధంబెల్ల విస్తరింతు.

268


వ.

అది యెట్లనిన ధర్మునిపత్నులు పదుండ్రయందు విశ్వయనుదానికి విశ్వేదేవతలు
పుట్టిరి. సాధ్య యనుదానికి సాధ్యులు పుట్టిరి. అరుణ యనుదానికి నరుణ్వంతులు
పుట్టిరి. భాస వనుదానికి భానుండు పుట్టె. ముహూర్త యనుదానికి ముహూ
ర్తంబులు పుట్టె. లంబ యనుదానికి ఘోషాదులు పుట్టిరి. జామి యనుదానికి
జామీగణంబులు పుట్టె మరుత్వతి యనుదానికి పృథ్వీవిషయంబులు పుట్టె.
సంకల్ప యనుదానికి సంకల్పంబులు పుట్టె. వసు వనుదానికి నావుండును ధ్రువుం
డును సోముండును ధర్ముండును అనిలుండును అనలుండును ప్రత్యూషుండును
బ్రభాసుండును నన నెనమండ్రువసువులు పుట్టిరి. అందు నావునకు శ్రముండును
విశ్రాంతుండును బుట్టిరి. ధువునకు కాలుండు పుట్టె. సోమునకు వత్సరుండు
పుట్టె. ధర్మునకు ద్రవిణుండును హుతవహుండును బుట్టిరి. అనిలునికి బురోజ
వుండు నవిజ్ఞాతియుఁ బుట్టిరి. అనలునకుఁ గుమారుండు పుట్టె. ప్రత్యూషునకు
దేవలుండును క్షమావంతుండును బుట్టిరి. ప్రభాసునకు బృహస్పతి చెలియ లైన
యోగశిద్ధకు విశ్వకర్ముండు పుట్టె.[4]

269
  1. వేవురు = వేయిమంది. తొంటి = మునుపటి.
  2. అగ్రజన్ములు = ముందు జనించినవారు - అన్నలు, ఎందుఁ బోయి మడిసిరో = ఎక్కడ పోయి వచ్చిరో, దివిజులను = దేవతలకును.
  3. అనుజన్ములు = వెనుక పుట్టినవారు - తమ్ములు, మరలక = తిరిగిరాక.
  4. నష్టసంతానుఁడు = చెడినసంతతి గలవాఁడు, అఱువండ్రు = అఱువదిమంది, పదుండ్రను = పదిమందిని.