పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వసంతతిలకావృత్తము.

ఆవిశ్వకర్మ సముదంచితశిల్పవిద్యా
ప్రావీణ్యతం ద్రిదశపట్టణతక్షకుండై
భావంబునందు బహుభంగుల నేమియైనన్
గావించుచుండుఁ దనకౌశల ముల్లసిల్లన్.[1]

270


వ.

అట్టివిశ్వకర్మ ప్రజాపతికిఁ ద్వష్ట పుట్టె. వానికి మహాతపోధనుం డైనవిశ్వరూ
పుండు పుట్టె. వానికి హరుండును బహురూపియు త్ర్యంబకుండును అపరాజితుం
డును వృషాకపియు శంభుండును కపర్దియు రైవతుండును మృగవ్యాధుండును
శర్వుండును కపాలియు నన నేకాదశరుద్రులు పుట్టిరి. మఱియును.

271


ఆ.

ఆమరీచిపుత్రుఁ డగుకశ్యపప్రజా, పతి వరించినట్టి భామినీత్ర
యోదశంబునందు నుద్భవించినవారిఁ, దెలియ వినుము భూమిదేవముఖ్య.

272


వ.

అది యెట్లనినఁ గశ్యపుభార్య లైనయదితియు దితియు ధనువును నరిష్టయు సుర
సయు శ్వసనయు సురభియు వినతయు తామ్రయు క్రోధవశయు నిరయు కద్రు
వయు మునియు ననుపదుమువ్వురయందును బుణ్యవతి యైనయదితికి శక్రుండును
చక్రధరుండును బుట్టిరి మఱియును.[2]

273


క.

మును చాక్షుసమన్వంతర, మున దేవగణంబునందు ముఖ్యులు తుషితుల్
జనియించి రదితికడుపున, ననఘాత్ములు వారు ద్వాదశాదిత్యు లనన్.

274


వ.

వారు వైవస్వతమన్వంతరంబున నర్యముండును ధాతయుఁ ద్వష్టయుఁ బూషుం
డును రవియు వివస్వంతుండును సవితయు మిత్రుండును వరుణుండు నంశుండును
భగుండును తేజుండు నన ద్వాదశాదిత్యులై పుట్టిరి. బహుపుత్రునకుఁ బదునలు
వురు మనువులు పుట్టిరి. అంగిరసునకు రుచికుం డనుబ్రహ్మర్షి పుట్టె. కృతాశ్యుం
డను దేవమునికి దేవప్రహరణంబులు పుట్టె.[3]

275


క.

ఈయమరావళియంతయు, వేయిమహాయుగము లైనవిధిదివసమునం
దాయాయుగముల మఱియును, బాయక పుట్టుదురు యజ్ఞభాగంబులకై.[4]

276

ప్రహ్లాదచరిత్రము

వ.

మఱియుఁ గశ్యపప్రజాపతికి రెండవభార్య యైనదితియందు హిరణ్యకశిపుహిర
ణ్యాక్షులును సింహికయునుం బుట్టిరి. అందు సింహికను విప్రజిత్తి యను రాక్ష
సుండు పరిగ్రహించె. హిరణ్యకశిపురకుఁ బ్రహ్లాదుండు ననుహ్లాదుండును సంహ్లా
దుండును హ్లాదుండు నన నలువురు పుట్టి రందుఁ బరమభాగవతుం డైన ప్రహ్లా
దునిచరిత్రంబు చెప్ప నవాఙ్మానసగోచరం బది యెట్లనిన.[5]

277
  1. సముదంచిత...ప్రావీణ్యతన్ = మిక్కిలి యొప్పిదమైన శిల్పవిద్యలయందలి నేర్పుచేత, త్రిదశపట్టణతక్షకుఁడు = దేవలోకమునకు వడ్లవాఁడు, ఏమి యైనన్ = ఏశిల్పమునైనను, కౌశలము = నేర్పు.
  2. శక్రుండును = ఇంద్రుఁడును, చక్రధరుండును = విష్ణువును - వామనుఁ డనుట.
  3. ప్రహరణంబులు = ఆయుధములు.
  4. అమరావళి = దేవతాపఙ్క్తి - దేవసమూహము, విధిదివసమునన్ = బ్రహ్మదినమునందు.
  5. అవాఙ్మాసగోచరంబు = నోటికిని మనసునకును కానరానిది - చెప్పను తలఁచను శక్యము కానిదనుట.