పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

దితిజుఁడు హిరణ్యకశిపుఁడు, పితామహునిఁ గూర్చి తపము పెద్దయుఁ గాలం
బతిభక్తిఁ జేసి త్రిభువన, పతి యగువర మతనిచేతఁ బడసి కడంకన్.[1]

278


వ.

సర్వలోకకంటకంబుగా రాజ్యంబు చేయుచు నశేషంబులుగా యజ్ఞభాగంబులు
తాన కైకొనిన దేవతలు వెఱచి మనుష్యరూపంబులఁ బృథివియందు వర్తించు
చుండ నైశ్వర్యదర్పితుండై నిఖిలలోకంబుల బాధించుచు సిద్ధగంధర్వపన్నగా
దులు దన్ను నుపాసింప సకలరాక్షసదైత్యదానవలోకంబులు జయజయశబ్దంబులు
గావింపఁ బొంపిరివోవుచు నొక్కనాఁడు మద్యపానమత్తుండై మణికనకమయ
ప్రాసాదతలంబున సకలలోకంబులు గొలువఁ గొలువుండి బాలపాఠ్యంబు లైన
చదువులు నేర్చుచున్న ప్రహ్లాదుని గురుసమేతంబుగా రావించి గారవించి
యిట్లనియె.[2]

279


ఉ.

ఏమిసుభాషితంబు పఠియించితి పుత్రక రాజనీతు లే
మేమి యెఱుంగఁజెప్పె గురుఁ డిప్పుడు నీదగుపుస్తకంబునం
దేమి లిఖించియున్నయది యిప్పుడు పాఠకశక్తిఁ జూచెదన్
మామది కింపుగాఁ జదువుమా యొకపద్యము వీరిముందఱన్.[3]

280


వ.

అనినఁ దండ్రికిఁ గొడు కిట్లనియె.

281


ఆ.

ఏను సారభూత మైనసుభాషితం, బెఱిఁగినాడ దానవేంద్ర వినుము
విష్ణుభక్తికంటె విష్ణవినుతికంటె, నెక్కుడైనచదువు లెందుఁ గలవు.[4]

282


చ.

అనవుడు దైత్యలోకవిభుఁ డవ్వచనంబు నిశాతశూలమై
తనదగుకర్ణరంధ్రములఁ దాఁకిన మిక్కిలికోపరక్తలో
చనములతోడఁ బుత్రకునిసన్నిధియం దుచితాసనంబునం
దనరుచు నున్నతద్గురునిఁ దప్పక చూచి యదల్చి యిట్లనున్.[5]

283


చ.

కటకట బ్రహ్మబంధుఁడవు గాని గురుండవు గావు చిన్నకూఁ

  1. పితామహునిన్ = బ్రహ్మను, త్రిభువనవతి = స్వర్గమర్త్యపాతాళము లనెడు మూఁడులోకములకు ప్రభువు, పడసి = పొంది, కడంకన్ = ఉత్సాహముతో.
  2. సర్వలోకకంటకంబుగాన్ = ఎల్లలోకములకు ముల్లుగా - సమస్తలోకములకు బాధకుఁడుగా ననుట, అశేషంబులుగాన్ = మిగత లేకుండునట్లుగా, పృథివియందున్ = భూమియందు, వర్తించుచుండన్ = మెలఁగుచుండఁగా, ఐశ్వర్యదర్పితుఁడు = సంపదచేత గర్వించినవాఁడు, ఉపాసింపన్ = సేవించగా, పొంపిరివోవుచు = విఱ్ఱవీఁగుచు, మద్యపానమత్తుండై = మద్యము త్రాగుటచేత దేహము దెలియనివాఁడై, మణి...తలంబునన్ = రత్నములు చెక్కిన బంగారుమేడమీఁద, బాలపాఠ్యంబులు = బాలకులకు చదువదగినవి.
  3. సుభాషితంబు = మంచిమాట - నీతి యనుట.
  4. సారభూతము = సత్తైనది.
  5. నిశాత = వాడియైన, కోపరక్తలోచనములతోడన్ = కోపముచేత ఎఱ్ఱనైన కమ్నలతో, సన్నిధి = సమీపప్రదేశము, ఉచితాసనంబునన్ = తగినపీఠమునందు, తనరుచున్ = ఒప్పుచు, తద్గురునిన్ = ఆకొడుకును చదివించునట్టి యయ్యవారిని, తప్పక = చూపుతప్పక.