పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కానఁ దరువులు మీరు సఖ్యంబు సేయ, వలయు నీకన్య బహుపుణ్యవతి మహీరు
హముల కుదయించె మారిష యండ్రు నాసు, ధామయూఖములను ప్రవర్ధనము నొందె.[1]

199


క.

ఈకన్యను మీరందఱుఁ, జేకొని పాణిగ్రహణము సేయుం డీనా
ళీకనిభాయతనేత్రకు, మీకును జన్మించు సుతుఁ డమేయబలుండై.[2]

200


వ.

వాఁడు యుష్మదస్మత్తేజోభాగంబులఁ గైకొని దక్షనామంబునం బ్రజాపతి యగు
నతనివలనఁ బ్రజాసమృద్ధి యగు ననిన నొడంబడి ప్రచేతసులు చంద్రున కిట్లనిరి.[3]

201


ఆ.

 ఈలతాంగిజన్మ మెవ్విధం బవనీరు, హంబులందు నెట్టు లవతరించె
నీసుధామయూఖనివహంబుతో నెట్లు, వృద్ధిఁ బొందెఁ జెప్పవే మహాత్మ.[4]

202

మారిషవృత్తాంతము చంద్రుండు ప్రచేతసులకుఁ జెప్పుట

వ.

అనినం జంద్రుం డిట్లనుఁ దొల్లి కంధుం డనుమునీంద్రుండు గోమతీతీరంబున ఘోర
తపంబు సేయుచున్న నతనితపోమహత్వంబునకు సంక్షోభించి దేవేంద్రుండు ప్ర
మోచన యను నప్సరసం బిలిచి బహుమానపురస్సరంబుగా నిట్లనియె.[5]

203


ఆ.

కాంత నీవు వోయి కంధమునీంద్రుని, మదనరాగతంత్రమగ్నుఁ జేసి
వానితపము చెఱిచి వలసినయప్పుడ, రమ్ము పొమ్ము చెలుల నెమ్మిఁ గూడి.[6]

204


వ.

అని నియమించి పంచిన.

205


సీ.

పడఁతిబింకపుగుబ్బపాలిండ్లు కంతునిగిరిదుర్గములతోడఁ గ్రీడ సేయఁ
గమలాక్షినిడువాలుకన్నులు కుసుమాస్త్రుక్రొవ్వాఁడితూపులఁ గొఱఁత పఱప
నలివేణినూగారుసౌరు శంబరవైరినిడువాలువాలుతో నెయ్య మాడఁ
జిగురాకుబోఁడిభ్రూయుగ మంగజాతునిచెఱకుసింగిణివింటి కొఱపు గఱప

  1. సుధామయూఖములన్ = అమృతకిరణములచేత, ప్రవర్ధనము = వృద్ధిని.
  2. పాణిగ్రహణము సేయుఁడు = పెండ్లియాడుఁడు, నాళీకనిభాయతనేత్రకున్ = తామర(ఱేకుల)వలె విశాలములైన కన్నులుగలదానికిని, అమేయబలుఁడు = మేరమీఱిన బలముగలవాఁడు.
  3. యుష్మదస్మత్తేజోభాగంబులన్ = మీయొక్కయు నాయొక్కయు తేజస్సునందలి యంశములను.
  4. లతాంగి = తీఁగవంటిదేహము గలది - ఆఁడుది.
  5. సంక్షోభించి = కలఁతనొంది.
  6. మదనరాగతంత్రమగ్ను = కామాసక్తమైన క్రియయందు మునిఁగినవానిఁగా - మిక్కిలికామాసక్తి నొందినవానిఁగా ననుట.