పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వారాశిజలములోపల, నారీతిం దపము దశసహస్రాబ్దంబుల్
వారలు సేయ నరాజక, మై రాష్ట్రములందు నెల్ల నడవులు పెరిగెన్.[1]

191


క.

ఋక్షకిరిహరిణగజహ, ర్యక్షలులాయాదిమృగభయంకర మగుచున్
వృక్షంబులట్లు పెరిగి ప్ర, జాక్షయ మొనరించు టెఱిఁగి జనపతితనయుల్.[2]

192


వ.

నిజతపోమహత్వంబులం జేసి ఝంఝానిలంబు గల్పించి మహీరుహంబు లున్మూ
లంబుగాఁ జేసి యాత్మీయకోపానలంబున భస్మీభూతంబు సేయుచున్నసమయం
బున.[3]

193


క.

మానుగఁ గించిచ్ఛేషము, లైనమహీరుహములందు నతులితకరుణా
నూనమతితోడ నాసిత, భానుఁడు చనుదెంచి వృక్షపతి దా నగుటన్.[4]

194


క.

చటులక్రోధపరీత, స్ఫుటమానసులై వెలుంగుభూపతిసుతులం
బటుగతి శాంతులఁగాఁ జే, యుటకై మఱియెండువెరవు లొదవక యున్నన్.[5]

195


సీ.

ముఖ మనుశశిబింబమునకుఁ గస్తూరికాతిలకకళంకంబు చెలువు మెఱయ
ధమ్మిల్ల మనుగాఢతమసంబులోఁ బుష్పచయతారకావళి సౌరు మీఱఁ
గనుచూపు లనుమన్మథునిమోహనాస్త్రంబులందుఁ గాటుకమచ్చు సందడింప
శృంగార మనుసుధాసింధుమధ్యంబున వళితరంగశ్రేణి వన్నె కెక్క


తే.

ఘనకుచము లనుకిన్నెరకాయలకును, బట్టుపయ్యెద గవుసెన బాగు సూప
సకలసౌభాగ్యలక్షణచారుమహిమ, నుల్లసిల్లెడు కన్యక నోర్తుఁ దెచ్చి.[6]

196


క.

మానవపతినందనులకుఁ, గానుకగా నిచ్చి వారిఘనకోపంబుల్
మానిచి వినయవిధేయుం, డై నలినవిరోధి వారి కనియెం బ్రీతిన్.[7]

197


ఆ.

మీరు లేనినాఁడు మేదినీజనులకు, బాధ చేసినట్టి పాదపముల
నింతయాజ్ఞ వెట్టు టెంతయు నర్హమె, యైనదీర్ఘకోప మనుచితంబు.[8]

198
  1. వారాశి = సముద్రము, దశసహస్రాబ్దంబులు = పదివేలసంవత్సరములు.
  2. ఋక్ష...భయంకరము = ఎలుఁగుగొడ్లు అడవిపందులు జింకలు ఏనుఁగులు సింహములు కారుదున్నపోతులు మొదలుగా గలమృగములచేత భీతిని కలుఁగఁజేయునది.
  3. ఝంఝానిలంబు = వానగాలిని, ఉన్మూలంబులు = పెల్లగిల్లినవి, ఆత్మీయ = తమదైన.
  4. మానుగన్ = చక్కగా, కించిచ్చేషములు = కొంచెము మిగిలినవి, అతులిత... తోడన్ = సరిపోల్పరానిదయచేత తక్కువగాని బుద్ధితో - మిక్కిలిదయగలవాఁడై, సితభానుఁడు = చంద్రుడు.
  5. చటుల...మానసులు = అధికశోకముచేత ఆక్రమింపఁబడుటచే ప్రకటిల్లుతున్న మనస్సులు కలవారు, ఒండువెరవులు = ఇతరమైన యుపాయములు.
  6. శశిబింబమునకు = చంచంద్రబింబమునకు, కళంకము = చిహ్నము, ధమ్మిల్లము = కీలుగంటు, గాఢతమసంబుతోన్ = దట్టపుఁజీఁకటిలో, పుష్పచయతారకావళి = పూసరమనెడు నక్షత్రపఙ్క్తి, సౌరు = అందము, మచ్చు = చొక్కుమందు, సందడింపన్ = అతిశయించఁగా, సుధాసింధుమధ్యంబునన్ = సముద్రమునడుము, వళితరంగశ్రేణి = కడుపుమీఁద ముడుత లనెడుఅలలవరుస.
  7. నలినవిరోధి = చంద్రుఁడు.
  8. లేనినాఁడు = లేకుందునట్టికాలమున, పాదపములన్ = వృక్షములను, ఆజ్ఞ వెట్టుట = శిక్షించుట, ఎంతయు నర్హమె = మిక్కిలియుక్తమే.