పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సతతంబును దనయాజ్ఞకు, మితిదాఁటక భక్తియుక్తి మెలఁగుచు వినయా
న్వితు లగుసుతులకు లోక, స్తుతచరితులకును బ్రచేతసుల కిట్లనియెన్.[1]

182


తే.

వేఱులేనిధర్మంబుల విస్తరిల్లు, మీకుఁ బడయంగరాని దేమియును లేదు
కాన నాయాజ్ఞఁ బూని యుగ్రంపుఁదపము, సలిపి పంకజనాభుఁ బ్రసన్నుఁ జేసి.


తే.

భావికాలంబునకుఁ బ్రజాపతివిలాస, ములు వహించి చరాచరభూతసృష్టి
నర్థిఁ గావింపుఁ డనుటయు నట్లకాక, యని యొడంబడి రందఱు నధికభక్తి.[2]

184


క.

జనకునినియోగమున వా, రొనరఁ బ్ర జార్థంబు సాగరోదకమధ్యం
బునఁ బదివేలేండ్లు దపం, బొనరించిరి విష్ణుఁ గూర్చి యున్నతభక్తిన్.[3]

185


వ.

ఇవ్విధంబున ఘోరతపంబు సేయుచున్న వారలకుఁ బ్రసన్నుఁడై వెన్నుండు.[4]

186


శా.

ఆదిత్యప్రతివీరవాహనముతో నత్యుజ్జ్వలప్రావృడం
భోదప్రాయశరీరవైభవముతో భూరిప్రభాజాలసం
పాదోదంచితశంఖచక్రములతోఁ బ్రస్ఫీతపీతాంబరుం
డై దామోదరుఁ డేగుదెంచెను బ్రమోదాయత్తచిత్తంబునన్.[5]

187


తే.

ఇట్లు ప్రత్యక్షమై జగదీశ్వరుండు, వారిఁ గనుఁగొని మీరెల్లఁ గోరినట్టి
వరము లెల్లను గృపసేయువాఁడ నగుదు, ననిన నభివాదనము చేసి యధిపసుతులు.[6]

188


ఉ.

ఓకమలామనోరమణ యోజగదేశపవిత్ర యోశుభా
లోకన యోపయోజదళలోచన యోమహనీయకౌస్తుభ
స్వీకృతవక్ష యోసుగుణశేఖర యోకరుణాపయోనిధీ
మాకుఁ బ్రజాపతిత్వములు మన్ననతోడ ననుగ్రహింపవే.[7]

189


వ.

అనిన నద్దేవుండు వారు కోరినట్ల భవదీయపుత్రుండు దక్షనామంబునం బ్రజాపతి
యగునని వరం బిచ్చి యంతర్ధానంబునుం బొందెఁ బ్రచేతసులును సముద్రంబు
వెడలి వచ్చి.

190
  1. మితి దాఁటక = మేర మీఱక, వినయోన్వితులు = అడఁకువతోఁ గూడుకొన్నవారు.
  2. భావికాలంబునకున్ = భవిష్యత్కాలమునకు - రాగల కాలమునకు.
  3. నియోగమునన్ = నియమనముచేత.
  4. వెన్నుండు = విష్ణువు.
  5. ఆదిత్యప్రతివీరవాహనముతోన్ = గరుత్మంతునితో (గరుత్మంతుఁడు అమృతముకొఱకు దేవతలతో ఎదిరించినవాఁడుఁ కాఁబట్టి ఆదిత్యపతివీరుఁడని ప్రయోగింపబడెను), అత్యుజ్జ్వల...వైభవముతోన్ = మిక్కిలి వెలుఁగుచున్న వానకాలమునందలి మేఘమువంటి దేహకాంతిసంపత్తితో, భూరి... చక్రములతోన్ = మిక్కుటమైన శాంతిసముదాయమును కలిగించుటచేత ఒప్పిదమైన శంఖచక్రములతో, ప్రస్ఫీతపీతాంబరుండు = ఆధిక్యమును దెలుపునట్టి పచ్చపట్టుతాపితాను ధరించినవాఁడు.
  6. అభివాదనము చేసి = కులగోత్రనామములను చెప్పి నమస్కరించి.
  7. కమలామనోరమణ= లక్ష్మీదేవికి ప్రియుఁడా, శుభాలోకన= మేలుకలిగించెడు చూపుగలవాఁడా, పయోజదళలోచన = తామరాకులవంటి కన్నులుగలవాఁడా, మహనీయ = మహాత్ముఁడా, కౌస్తుభస్వీకృతవక్ష = కౌస్తుభమను మణిని తాల్చిన ఱొమ్ముగలవాఁడా, కరుణాపయోనిధీ = దయాసముద్రుఁడా.