పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

ఆదుగ్ధంబులచేత భూమివలయం బాప్లావమై సస్యముల్
ప్రాదుర్భూతము నొందె మానవులకుం బాటిల్లె సౌఖ్యంబు నా
నాదేశంబులయందుఁ గల్గె ధనధాన్యంబు ల్సమగ్రంబుగా
మోదం భారఁగఁ గోరినట్లు పిదుకన్ మువ్వేళలన్ ధేనువున్.[1]

175


క.

తోరముగ వత్సదోగ్ధృ, క్షీరంబులు దేవదైత్యకిన్నరగంధ
ర్వోరగనరమృగముల కా, యారూపము లైనయట్టియశనము లయ్యెన్.[2]

176


వ.

ఇవ్విధంబున దేవతిర్యఙ్మనుష్యాదినానాలోకంబులకును వృక్షలతాపర్వతనికరం
బులకుం దగినయాహారంబులు గల్పించి నిర్వక్రపరాక్రమంబున సకలప్రజాను
రంజనంబుగా ననేకకాలంబు రాజ్యంబు సేయుచుఁ దనపేర భూమికి పృథివి
యనునామంబు గల్పించె నని చెప్పి మఱియును.[3]

177


ఉ.

ఈపృథుచక్రవర్ధికథ యెవ్వరు విన్నను వారి కెన్నఁడుం
బాపము లేదు తేజమును భవ్యసుఖంబును నిత్యరాజ్యల
క్ష్మీపరిపాలనస్థితియుఁ గీర్తియుఁ జేకుఱు నిత్యకృత్యముల్
శ్రీపతి యశ్వమేధ మొనరించినపుణ్యము నిచ్చుఁ బెంపుతోన్.[4]

178


వ.

అట్టిపృథుచక్రవర్తికి నంతర్థియు వార్ధియు నన నిరువురు పుట్టి రందు నంతర్థికి
శిఖండి యనుదానికి హవిర్ధానుండు పుట్టె వానికి నాగ్నేయి యైనధిషణ యను
దానికి నొక్కతనయుండు పుట్టె వాఁడు కుశలుండై యజ్ఞకాలంబునం గుశనిచ
యంబుఁ బ్రాచీనాగ్రంబుగా నొనరించుటంజేసి ప్రాచీనబర్హి యనంబరఁగె అట్టి
ప్రాచీనబర్హికి సముద్రపుత్రి యైన సౌవర్ణ యనుదానికి ధనుర్వేదపారగు లగు
ప్రచేతసులు పదుండ్రు పుట్టిరి వారు పృథగ్భేదంబులు లేనిధర్మంబులం బ్రవర్తి
ల్లుచు దశసహస్రవర్షంబులు సముద్రమధ్యంబునం దపంబు చేసి రనిన మైత్రేయుం
డిట్లనియె.[5]

179

ప్రచేతసులు తపస్సు చేసి శ్రీహరివలన వరంబులు పడయుట

తే.

ఆప్రచేతసు లబ్ధిలో నధికతపము, దశసహస్రవర్షంబులు దమకుఁ జేయఁ
గారణం బేమి నాకు నీకథ వినంగ, వలయు ననుటయు నిట్లని పలికె నతఁడు.

180


క.

ప్రాచీనబర్హి పటుధ, ర్మాచరణసమగ్రవైభవాతిశయములన్
ప్రాచీనబర్హికైవడి, నేచి మహీరాజ్య మెల్ల నేలె గరిమతోన్.[6]

181
  1. అప్లావము = అంతట తడపఁబడినది, ప్రాదుర్భూతము నొందెన్ = పుట్టెను, పాటిల్లెన్ = కలిగెను, సమగ్రంబుగాన్ = పూర్తిగా, మువ్వేళలన్ = మూఁడువేళలయందును.
  2. వత్సదోగ్ధృక్షీరములు = దూడయు పిదుకువాఁడును పాలును.
  3. నిర్వక్రపరాక్రమంబునన్ = మొక్కపోని పరాక్రమముతో, ప్రజానురంజనంబుగాన్ = ప్రజలకు ఉల్లాసము కలుగునట్టివిధముగా.
  4. భవ్యసుఖంబును = మేలైనసౌఖ్యమును, చేకుఱున్ = సిద్ధించును.
  5. ఆగ్నేయి = ఆగ్నివలనఁ బుట్టినది, పృథగ్భేదంబులు = వేఱువేఱుమాఱుతలలు, ధర్మంబులన్ = నడవళ్లతో.
  6. ప్రాచీనబర్హికైవడిన్ = ఇంద్రునివలె, నేచి = అతిశయించి.