పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ననుచు గర్వించి పల్కిన యవనికాంత, వెఱచి యతనికి నెంతయు వినతి చేసి.

167


వ.

నీవు నిష్కారణంబుగ నన్ను వధియింప వలవదు ప్రజాసంరక్షణ కుపాయంబు
చెప్పెద వినుము సమస్తసస్యంబులు మహౌషధులు నాయందు జీర్ణంబులై
యున్నయవి యిప్పుడు గోరూపంబున నున్ననాకు వత్సంబు గలిగెనేని నీవలన
దుగ్ధదోహనంబు సేయంబడఁ దదీయక్షీరప్లావనంబునం జేసి మహీమండలంబున
నోషధులును బీజంబులు నుద్భవిల్లు నీప్రయత్నంబు చేయు మనిన వొడంబడి.[1]

168


తే.

తఱుచుగా నున్న కుత్కీలతతులవలన, మిఱ్ఱుపల్లంబు లైనట్టిమేదినీత
లంబు సకలంబును సమతలంబు సేయ, కున్నఁ గాదని తనలోన నూహజేసి.[2]

169


ఉ.

చండతరప్రతాపగుణశాలి పృథుం డురుబాహుదండకో
దండముల న్మహీధ్రములు ధన్వములన్ బడమీటి ధారుణీ
మండలదంతురావళులు మార్చి సమస్థలిగా నొనర్చె నా
ఖండలుఁ డాదిగా సురనికాయము నివ్వెఱ గంది చూడఁగన్.[3]

170


ఉ.

ఆమనుజేశ్వరుండు మహియందు సమస్థలు లైనఠావులన్
గ్రామములం బురంబులను ఖర్వటకంబుల రాజధానులన్
సీమలు వేఱువేఱ విభజించి ఫలాశను లైనమానవ
స్తోమము నన్నపానపరితుష్టులఁ జేయఁ దలంచి పెంపుతోన్.[4]

171


క.

సుకర మగువ్రీహిధాన్య, ప్రకరాఖిలకాలఫలితభవ్యనదీమా
తృకదేవమాతృకాదులు, సకలావనియందుఁ గలుగ సంపాదించెన్.[5]

172


వ.

మఱియు మనుష్యులకుం దగినజీవనోపకరణంబులు సర్వసంపన్నంబులుగా సమ
కూర్చి.[6]

173


క.

పాయక భూధేనువునకు, స్వాయంభువుఁ గ్రేపు గాఁగ సమకట్టి మహీ
నాయకుఁడు పిదికె దుగ్ధ, ప్రాయంబై జగములెల్లఁ బరిపూర్ణముగన్.[7]

174
  1. జీర్ణంబులు = అడఁగినవి, వత్సంబు = దూడ, దుగ్ధదోహనంబు = పాలుపిదుకుట, ప్లావనంబునం జేసి - = తడియుట చేత, ఒడంబడి = ఒప్పుకొని.
  2. కుత్కీలతతులవలన = పర్వతసమూహములవలన, ఊహచేసి = ఊహించి.
  3. చండతర... శాలి = మిక్కిలి తీక్ష్ణమైన ప్రతాపగుణముచేత ఒప్పినవాఁడు, మహీధ్రములు = కొండలు, ధన్వములన్ = మరుభూములయందు - నీళ్లు లేనిభూములయందు, మీటి = ఎగఁజిమ్మి, దంతురావళులు . = మిట్టలసముదాయములను, సమస్థలిగాన్ = చదరపునేలగా, ఆఖండలుఁడు = ఇంద్రుఁడు, నికాయము = గుంపు, నివ్వెఱఁ గంది = అత్యాశ్చర్యమును పొంది.
  4. ఠావులన్ = ప్రదేశములయందు, ఖర్వటకంబులన్ = బోయపల్లెలను, రాజధానులన్ = రాజు నివసించు పట్టణములను, సీమలు = ఎల్లలు, విభజించి = విభాగించి, ఫలాశనులు = పండ్లు ఆహారముగా చేసికొనువారు, పరితుష్టులన్ = మిక్కిలితృప్తి పొందినవారినిగా, పెంపుతోన్ = గౌరవముతో.
  5. వ్రీహి...ఆదులు = పరిధాన్యపుతెగలయొక్క యెల్లకారులపంటలచేత మేలైన యేటినీళ్లపాఱుదల కలవియు నైనపొలములు మొదలగునవి.
  6. జీవనోపకరణములం = బ్రదుకుఁదెరుపు కొఱముట్లు, సర్వసంపన్నంబులుగాన్ = కొఱఁత లేకుండునట్టుగా.
  7. క్రేవు = దూడ, సమకట్టి = జతపఱిచి, దుగ్ధప్రాయంబు = కొంచ మెచ్చుతక్కువగా పాలవంటిది.