పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

అది నిమిత్తంబు సకలధాన్యములు లేక, పెద్దకాలంబు కఱవయ్యె పృథివియందుఁ
గందమూలఫలాశులై కానలందుఁ, గుందుచున్నారు మనుజులు కువలయేశ.[1]

158


క.

అన్నంబు ధాన్యమూలం, బన్నంబు సమస్తజనుల కాధారం బా
యన్నంబు లేక ప్రాణము, లెన్నం డెవ్వారికైన నేగతి నుండున్.

159


శా.

అన్నోపాయము మాకుఁ జేయుమని త న్నర్థింప నుగ్రక్షుధా
పన్నానేకజనావనుం డగుచు భూపాలుండు కారుణ్యసం
పన్నం బైనమనంబుతోడ నుచితోపాయంబు వేఱొండు లే
కున్నన్ క్షత్రియధర్మ మూఁది పటుకోపోద్యుక్తుఁడై యుద్ధతిన్.[2]

160


తే.

సస్యనాశంబు గావించి జనుల కెల్లఁ, గర్వు చేసినయామహీకాంతఁ బట్టి
సంహరించెద నని శరాసనముఁ బట్టి, దివ్యబాణంబు సంధింపఁ దివురుటయును.[3]

161


క.

ఆరాజన్యునిచలమును, వీరత్వముఁ జూచి వెఱచి విశ్వంభర దా
గోరూపంబునఁ బఱచెను, సారసభవలోకమునకు సంభ్రమ మెసఁగన్.[4]

162


మత్తకోకిల.

ఎక్కుపెట్టినవింట సాయక మేర్చుచున్ వసుధావరుం
డక్కజంబుగ మౌర్విటంకృతు లాకసంబున నొక్కటన్
బిక్కటిల్ల భయంకరాకృతిఁ బృథ్వి వెన్కొని యింక నీ
వెక్కడెక్కడఁ బోయిన న్వధియింతు నెవ్వరు గాచినన్.[5]

163


ఉ.

నావుడు భూమి పల్కు నరనాథునితో భయకంపితాంగియై
భూవరచంద్ర నీవు ననుఁ బూని వధింపఁగ నింత యేటికిన్
స్త్రీవధ పాపమూల మటు సేయఁగ నీ కగులాభ మేమి నే
జావఁగ నేవిధంబునఁ బ్రజాపరిపాలన మాచరించెదో.[6]

164


వ.

అనినం బృథుండు పృథివి కిట్లనియె.

165


క.

విను నిన్ను దుష్టచారిణిఁ, దునిమిన మానవులు గరిమతో నుండుదు రీ
జనులం గాచినపుణ్యము, నినుఁ జంపినపాతకంబు నీఁగఁగ లేదే.[7]

166


తే.

నీవు లేకున్న నేమి నే దైవయోగ, బలముపెంపున భరియింతుఁ బ్రజలనెల్ల

  1. పెద్దకాలంబు = చిరకాలము, కందమూలఫలాశులు = దుంపలు పండ్లు తినువారు, కానలందున్ = అడవులయందు, కుందుచున్ = దుఃఖించుచు, కువలయేశ = పుడమిఱేఁడా.
  2. ఉగ్రక్షుధాపన్నానేకజనావనుండు = భయంకరమైన (ఓర్వరాని) ఆఁకలిచేత ఆపద నొందినవారైన పెక్కండ్రు జనులను రక్షించువాఁడు, కారుణ్యసంపన్నంబు = దయ కలిమి కలది, ఊఁది = అవలంబించి, పటుకోపోద్యుక్తుఁడు = దృఢమైన కోపపుపూనిక కలవాఁడు.
  3. మహీకాంతన్ = భూదేవిని, తివురుటయున్ = ఉద్యుక్తుఁడు కాగానే.
  4. విశ్వంభర = భూమి, సారసభవలోకమునకున్ = బ్రహ్మలోకమునకు, సంభ్రమము = తొట్రుపాటు, ఏర్చుచున్ = జ్వలింపఁజేయుచు.
  5. మార్వి = అల్లెత్రాడు, పిక్కటిల్లన్ = నిండఁగా, వెన్కొని = వెంబడించి.
  6. భయకంపితాంగి = భయముచేత వడఁకుచున్నదేహముగలది.
  7. దుష్టచారిణిన్ = చెడ్డనడవడి గలదానిని, ఈగఁగలేదే = పోఁగొట్టఁజాలదా.