పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అని సూతమాగధులకును, ఘనతరవాగ్విభవమహిమ గలిగింపగ న
మ్మునులెల్లను విని ప్రమదం, బునఁ బొందఁగ వారు రాజుఁ బొగడిరి గరిమన్.[1]

150


ఉ.

ఆతతధర్మశీలుఁడు దయాపరతంత్రుఁడు సర్వలోకవి
ఖ్యాతయశుండు సాధుహితకారి మహీసురరక్షణక్రియా
కౌతుకుఁ డున్నతోన్నతవికాసితభాసితుఁ డంచు నాధరి
త్రీతలసార్వభౌము వినుతింతురు నిత్యము సూతమాగధుల్.[2]

151


వ.

ఇట్లు సూతమాగధస్తోత్రంబులకు మెచ్చి పృథుచక్రవర్తి స్తోత్రంబులకు నర్హంబు
లైనచరిత్రంబులం బ్రవర్తించుచుండె.

152


తే.

ధరణిపులు నాటనుండియుఁ దమకుఁ గలిగి, నట్టికీర్తిప్రతాపాదు లహరహమును
సూతమాగధనిర్మలస్తోత్రవచన, రచనలను వినుచుండుదు రుచితగతుల.[3]

153


తే.

ఇట్లు పృథుచక్రవర్తి యనేకక్రతువు, లొనరఁ గావించి మించి యథోక్తభూరి
దక్షిణలు భూమిసురులకుఁ దనియ నిచ్చి, భూమి పాలించె సంపూర్ణకాముఁ డగుచు.

154


శా.

క్షోణీమండలిలోపలం గలప్రజల్ క్షుత్తృట్ప్రపీడార్హులై
ప్రాణంబు ల్నిలుపంగ నోపక శరీకంబు ల్వెసం దూలఁగాఁ
ద్రాణ ల్దప్పి త్వగస్థిమాత్రు లగుచున్ దైన్యంబు నొందంగఁ బ్ర
క్షీణప్రాభవులై వెసం జనిరి దుఃఖీభూతచేతస్కులై.[4]

155


వ.

ఇ ట్లరిగి పృథుచక్రవర్తిం బొడఁగాంచి యిట్లనిరి.

156


చ.

నరవర యెల్లధర్మములు నష్టములయ్యెను దానఁ జేసి లే
బరములు సర్వదేశములఁ బాటిలె దానను జేసి వర్షముల్
గురియక మానె దైవ మనుకూలము చాలనికీడు చెంది చె
చ్చెర బహుసస్యమోషధులు జీర్ణములై చెడిపోయె మేదినిన్.[5]

157
  1. ఘనతరవాగ్విభవమహిమ = మిక్కిలి గౌరవమును (సూచించునట్టి) మాటలయొక్క వైభవాతిశయమును, గరిమన్ = గురుత్వముతో.
  2. ఆతతధర్మశీలుఁడు = అధికధర్మము చేయుటయే స్వభావముగాఁ గలవాఁడు, సర్వలోకవిఖ్యాతయశుఁడు = ఎల్లలోకములయందు ప్రసిద్ధమైన కీర్తి గలవాఁడు, సాధుహితకారి = యోగ్యులకు మేలు చేయువాఁడు, మహీసురరక్షణక్రియాకౌతుకుఁడు = బ్రాహ్మణులను రక్షించెడుపనియందు కుతూహలము గలవాఁడు, ఉన్నతోన్నతవికాసితభాసితుఁడు = గొప్పవారియందు గొప్పవాఁడై వెలయుటచేత ప్రకాశించువాఁడు.
  3. ధరణిపులు = రాజులు, అహరహము = ప్రతిదినము, ఉచితగతులన్ = తగినరీతులతో.
  4. క్షోణీమండలి = భూమండలము, క్షుత్తృట్ప్రపీడార్తులు = ఆఁకలిదప్పులచేత మిక్కిలి పీడించఁబడినవారు, తూలగాన్ = బలహీనములు కాఁగా, త్రాణలు = సత్తువలు, త్వగస్థిమాత్రులు = తోలుఎముకలు మాత్రము కలవారు, ప్రక్షీణప్రాభవులు = క్షీణించిన ప్రభుత్వములు గలవారు, దుఃఖీభూతచేతస్కులు = దుఃఖము నొందినమనస్సు కలవారు.
  5. లేబరములు = దారిద్ర్యములు, పాటిలెన్ = కలిగెను, బహుసస్యము = అనేకవిధము లైనపైరు, ఓషధులు = ఫలించుటతోడనే నశించునట్టి అరఁటి మొదలైనవి, జీర్ణములు = సారహీనములు.