పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కవచమును వచ్చె దేవలోకముననుండి, యవి మహాసాధనము లయ్యె నవ్విభునకు.[1]

140


క.

అపరిమితపాపకర్మము, లపగతమై యంగసూనుఁ డగువేనుఁడు ధ
ర్మపరాయణశీలుం డగు, సుపుత్రజననంబువలన సుగతికిఁ జనియెన్.[2]

141


క.

ఉదధుల గంగాదిమహా, నదులందును మునులు మణికనకపాత్రములం
దుదకంబు దెచ్చి భద్రము, లొదవఁగఁ బుణ్యాభిషేక మొనరించి రొగిన్.

142


క.

అట్టియెడ సకలసురలును, నెట్టనఁ గొలువంగ వచ్చి నీరజభవుఁ డా
జెట్టిని భూలోకమునకుఁ, బట్టము తగఁ గట్టి సార్వభౌమునిఁ జేసెన్.[3]

143


క.

హరిచక్ర మతనిదక్షిణ, కరమున విలపిల్లె నపుడు కమలజుఁడు చరా
చరభూతంబులు వినఁగా, నరుదారఁగఁ జక్రవర్తి యని కొనియాడెన్.

144


వ.

ఇవ్విధంబునఁ బృథుచక్రవర్తి యత్యంతధర్మమూర్తియు మహదైశ్వర్యసమేతుం
డు ననవరతసేవాగతచరాచరభూతుండును నై రాజ్యంబు సేయు నపుడు.[4]

145


క.

జున్నులు గలయడవుల మహి, దున్నక విత్తక ఫలించుఁ దోరపు మొదవుల్
చ న్నవిసి పాలు పిదుకును, వన్నెగ నెలనెలకు మూఁడువానలు గురియున్.[5]

146


క.

పృథుచక్రవర్తి యప్పుడు, పృథివీవలయమున సకలపీడలు వొలియన్
పృథుపై తామహయజ్ఞము, ప్రథతంబుగఁ జేసె సురలు ప్రస్తుతి సేయన్.[6]

147


క.

క్రతుహోమసూత్రసూత్యా, హుతులవలన శిశువు లిరువు రుదయించిరి య
ప్రతిమానవాక్సమంచిత, మతులు న్విలసిల్లి సూతమాగధు లనఁగన్.[7]

148


ఉ.

వారలసౌకుమార్యములు వారలసోంపులు వారిపెంపులున్
వారలవాగ్విలాసములు వారలకోమలకంఠనాదవి
స్తారము చూచి మెచ్చి మునిసంఘములందఱు మీర లీధరి
త్రీరమణుం బృథుం బృథుమతిన్ వినుతింపుఁడు నేటనుండియున్.[8]

149
  1. కరవాలము = కత్తి, అక్షయ...యుగము = అక్షయములై భయంకరములైన బాణములు గల అమ్ములపొదుల జంట, వజ్రకవచమురవలు చెక్కిన లోహపుచొక్కాయ.
  2. అపగతమై = తొలంగి, సుగతికిన్ = సద్గతికి.
  3. నెట్టనన్ = పూనికతో, జెట్టిని = శూరుని, సార్వభౌముని = చక్రవర్తిని.
  4. అనవరత...భూతుండును = ఎడతెగక కొలువవచ్చునట్టి చరములును అచరములు నైన భూతములు కలవాఁడు. (చర = తిరుగునవి, అచరములు = ఉన్నచోటనుండి కదలనివి).
  5. జున్నులు = తేనెతెట్టెలు, చ న్నవిసి = చన్నులనుండి తనంత నుబికి.
  6. పొలియన్ = నశింప, పృథుపైతామహయజ్ఞమున్ = పృథుపైతామహము అను యజ్ఞమును (పృథు = గొప్పది, పైతావహము = పితామహుఁ డనఁబడిన బ్రహ్మసంబంధ మైనది), ప్రథితంబుఁగన్ = ప్రసిద్ధముగా.
  7. సూత్యాహుతులవలన = బిడ్డలు కలుగునట్టి మంత్రములు చెప్పి వేల్చునట్టి ఆహుతులవల్లనుండి, (ఆహుతి = ఒకసారి అగ్నిలో వేల్వఁబడు ద్రవ్యము), అప్రతిమానవాక్సమంచితమతులన్ = సరిపోల్పరాని మాటలతోను ఒప్పిదమైనబుద్ధితోను.
  8. సౌకుమార్యములు = సుకుమారత్వములు, సొంపులు = చక్కఁదనములు, పెంవులు = గొప్పతనములు, వాగ్విలాసములు = మాటలచమత్కృతులు, కోమలకంఠనాదవిస్తారము = మృదువైసకంఠధ్వనియొక్క అతిశయము, పృథుమతిన్ = గొప్పబుద్ధితో, నేటనుండియున్ = ఈదినము మొదలుకొని.