పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తప్రకంపితవర్తనోద్యములు నగుచు, క్షోణిదేవత లాదిక్కు చూచునపుడు.[1]

126


క.

పొరిఁబొరిఁ బోరులవలనన్, ధరణీసురవరులు సంపదలు సకలంబున్
బఱివోయి రక్తధారలు, దొరఁగెడుదేహములతోడఁ దూలుచుఁ బెలుచన్.[2]

127


క.

పరిదేవన మొనరించుచు, నరుదేరఁగఁ జూచి మిగుల నాశ్చర్యరసం
భరితాత్ము లగుచు మీ కీ, పరిభవ మెట్లయ్యె నని తపసు లడుగుటయున్.[3]

128


ఉ.

ఈధరణీతలంబునకు నేలిక యెవ్వఁడు లేఁడు గావునన్
సాధుమతంబు లెవ్వియును సాగవు మ్లేచ్ఛకిరాతు లొక్కటన్
బాధ యొనర్పఁగాఁ బ్రజలు ప్రాణభయంబున నున్నవారు నా
నాధనధాన్యసంపదలు నాశము నొందె ననేకభంగులన్.

129


ఉ.

బందులఁ బట్టి చోరకులు బాధ యొనర్పఁగ ధారుణీసురుల్
గుంది సమస్తసంపదలు గోల్పడి కానలలోన నుండఁగాఁ
గొంద తెఱింగి కట్టి వెసఁగొట్టుచు భంగము లెల్లఁ జేయఁగాఁ
గొందలమంది యేడ్చుచును గూఁతలు పెట్టెద రాలకింపుఁడా.[4]

130


చ.

అదె ధరణీపరాగము భయంకరమై వినువీథిఁ బర్వుచు
న్నది పరికించి చూడుఁడి యనాథజనంబులదీననాదముల్
పొదలి వినంగవచ్చె మునిపుంగవు లందఱు వచ్చి యిట్టియా
పద లుడిగింపరే యనుచుఁ బ్రార్థన చేసి రనేకభంగులన్.[5]

131


ఉ.

ఆవసుధామరుల్ పటురయంబున నచ్చటి కేగి దోఁపులన్
బోవుట కెంతయుం బొగిలిపోయినవారలఁ దోడి తెచ్చి సం
భావన చేసి రిట్లు తమబాసటచేత సమీపదేశముల్
హావళిఁ బోవకుండఁ దగునట్లుగ నారయుచుండి రెంతయున్.[6]

132


వ.

ఇవ్విధంబున నరాజకం బైనరాజ్యంబు నిర్వహింపం దగినరాజు నభిషిక్తుఁ జేయ
కున్నఁ బ్రజానాశం బగునని విచారించి మహీసురవరులు సుస్వరంబులుగా వేద

  1. రేణుపటల...మానసులు = రేణుజాలముచేత కప్పఁబడిన ఆకాశమును చూచుటయందు ఆసక్తమైన మనస్సు కలవారు, మహాద్భుత...ఉద్యములు = మిక్కిలియాశ్చర్యముచేత తడఁబడిన వ్యాపారప్రయత్నములు గలవారు, క్షోణిదేవతలు = బ్రాహ్మణులు.
  2. పొరిఁబొరిన్ = క్రమక్రమముగా, పఱివోయి = కొల్లపోయి, తొరఁగెడు = కాఱుచున్న, తూలుచు = వివశు లగుచు.
  3. పరిదేవనము = విలాపము, అరుదేరఁగన్ = రాఁగా, పరిభవము = అవమానము - భంగము.
  4. బందులన్ = బందిపోటులతో, కుంది = ఖిన్నులై, చోరకులు = చోరులు - దొంగలు, కోల్పడి = పోఁగొట్టుకొని, కొందలము = దుఃఖము, ఆలకింపుఁడా = వినుఁడు.
  5. పరాగము =దుమ్ము, వినువీథి = ఆకాశమార్గము, పర్వుచున్ = వ్యాపించుచు, దీననాదములు = పేదలయొక్క (మొఱ) చప్పుడులు, పొదలి = అతిశయించి
  6. వసుధామరులు = బ్రాహ్మణులు, దోఁపులన్ = దోఁపిడుల చేత, పొగిలి = పరితపించి, సంభావన =మన్నన, బాసటచేతన్ = సహాయముచేత, హావళిన్ = ఉపద్రవముచేత, ఆరయుచుండిరి = విచారించుచుండిరి.