పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క్షితిపతి చాటఁగాఁ బనిచె సింధుపరీతమహీతలంబునన్.[1]

103


సీ.

తనదుర్గుణంబులఁ గొనియాడ నొల్లనిసాధులోకంబుల సంహరించుఁ
దనకుఁ జెప్పక మహాధ్వరములు సేసినసోమయాజులయిండ్లు చూఱలాడుఁ
దనదురాచారవర్తనములు గాదన్న గురుజనంబులనైనఁ బరిభవించుఁ
దనుఁగూర్చి బుద్ధి సెప్పిన బంధువులనైనఁ బ్రాణాభిమానముల్ భంగపఱచుఁ


తే.

దనకు ననుకూలవృత్తి నుద్దండలీల, నుండుపాపాత్ములకు నెల్ల నూ ళ్లొసంగుఁ
దన్ను దైవంబుగాఁ గొల్చుచున్నవారి కొసఁగరానిపదార్థంబు లొసఁగు నతఁడు.[2]

104


క.

ఇల నెవ్వఁడు తనయాజ్ఞకు, వెలియై వర్తించు వేదవిప్రునినైనన్
దలఁ దైవ్వనేసి చంపుఁడు, తొలఁగక మీ రనుచుఁ బల్కె దుష్టభటాలిన్.[3]

105


శా.

వేనుం డీగతిఁ బాపకర్మములు గావింపంగ నాకీడున
న్వాన ల్గల్గక మానె నారబము లెండన్ జొచ్చెఁ బెక్కాపదల్
గాన న్వచ్చె సమస్తదేశముల మొక్కల్ దాఁక నన్యోన్యదు
ర్మానక్రోధమునం బ్రజ ల్చెడిరి క్షామం బయ్యె నానాఁటికిన్.[4]

106


చ.

మునివరు లెల్ల నానృపతిమూఢవివేకముఁ బాపకర్మవ
ర్తనమును జూచి యీతనికి ధర్మగుణంబులు బోధ చేసి స
జ్జననుతమార్గము ల్దెలిపి సాత్వికబుద్ధియు విష్ణుభక్తియుం
బనుపడఁ జెప్పి పాపములఁ బాపి కృతార్థు నొనర్త మర్థితోన్.[5]

107


చ.

అని తలపోసి యాతపసు లంగతనూజునిపాలి కేగి యా
తనిబహుమానపూర్వకవిధానము లైననృపాలయోగ్యపూ
జనములఁ దన్పి తొల్లిటిధరాతలనాథులసచ్చరిత్రముల్
మునుకొని చెప్పి యాకుమతిముక్కునఁ గోపము పిక్కటిల్లఁగన్.[6]

108


తే.

తొంటి నీవంశకర్తల దొరతనములఁ, బ్రబలుసచ్చరితంబులు భావికాల
మేదినీనాథులకు నెల్ల మేలుబంతి, గాఁ బ్రవర్తింప కేల దుష్కర్మి వైతి.[7]

109


చ.

తపసుల నేల చంపెదవు ధర్మము లేటికి సాగనీవు పా
వపతుల నేలఁ గూడెదవు బ్రాహ్మణనింద యొనర్చె దేల స

  1. ఉజ్జగించి = విడిచి, వీటిఁబుచ్చి = వ్యర్థపఱిచి, సింధుపరీత = సముద్రముచే చుట్టఁబడిన.
  2. చూఱలాడున్ = కొల్లపెట్టును, ఉద్దండలీలన్ = ఉద్ధతి గలరీతితో.
  3. వేదవిప్రుఁడు = వేదముచదివిన బ్రాహ్మణుఁడు, త్రెవ్వనేసి = తెగఁగొట్టి, తొలఁగక = తప్పక.
  4. కీడునన్ = దోషముచేత, అరణములు = పైరులు, మొక్కల్ దాకన్ = కొఱఁతలు తోఁచఁగా.
  5. మూఢవివేకమున్ = తెలివిమాలినతనమును, వర్తనమున్ = ప్రవర్తించుటను, పనుపడన్ = అలవాటుపడ.
  6. విధానములు = విధులు, తన్పి = తనియఁజేసి - తేర్చి యనుట, మునుకొని = పూని, అక్కుమతి = కుత్సితబుద్ధిగలవానియొక్క, పిక్కటిల్లఁగన్ = అతిశయించఁగా.
  7. తొంటి = తొల్లిటి, భావికాలమేదినీనాథులకు = ఇఁకమీఁదటి రాజులకు, మేలుబంతి = శ్రేష్ఠము - సరియైనదని గ్రహింపఁదగినది, దుష్కర్మివి = చెడ్డనడకకలవాఁడవు.