పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నప్పరమేశ్వరేశుఁ గొనియాడఁ దొడంగె వికాసభాసియై.[1]

75


ఉ.

శ్రీవనితాకళత్ర సరసీరుహసన్నిభనేత్ర భాగధే
యావహ దివ్యరూప నిగమాంతరహస్యకళాకలాప నా
నావరయోగినిర్మలమనస్సరసీరుహభృంగ చిత్సుధా
ప్లావితభక్తసంగ నిరపాయగుణోన్నత లోకసన్నుతా.[2]

76


ఉ.

కాష్ఠగతాగ్నివోలెఁ ద్రిజగంబులభూతములన్ గుణంబులం
గాష్ఠలయామినీదినవికారములన్ ఘటికాశరత్కళా
కాష్ఠలు మేరగాఁ గలుగుకాలములన్ భవదీయమూర్తి సు
శ్రేష్ఠతఁ జూపురూపమునఁ జెందుచు నుండుఁ బయోజలోచనా.[3]

77


చ.

అగణితలీల నొప్పు సచరాచరభూతసమగ్రమైనయీ
జగములపుట్టువున్ బ్రతుకుఁ జావును నీవలనన్ స్వభావమై
నెగడిన రాజసాదికమనీయగుణత్రయచేష్టితంబు లి
ట్లగుట యెఱింగియుం దలఁప రక్కట నిన్ను దురాత్ము లీశ్వరా.[4]

78


ఉ.

ఆవులచేతఁ బాలు గొని యందుఁ గ్రమంబున నెయ్యి వుచ్చి య
య్యావుల కాఘృతం బిడి ప్రియం బొనరించినయట్ల కాదె నీ
చే వరవాక్యవైఖరులు చేకొని నిన్ను నుతింపఁగా ముదం
బీపు వహింతు వీనటన లెల్లను జిత్రము లో జనార్దనా.[5]

79


వ.

అని యనేకప్రకారంబుల గొనియాడుచున్న యన్నరేంద్రనందను నవలోకించి
భవదీయస్తోత్రారాధనంబువలన సంతుష్టహృదయుండనైతి మద్దర్శనంబు వృథ
గాదు వరంబు వేఁడు మనినఁ బరమేశ్వరునకు నతం డిట్లనియె.

80


క.

సర్వప్రాణులయందును, సర్వాంతర్యామి వైనసర్వేశుఁడవున్
సర్వజ్ఞుండవు నగునీ, కుర్వీధర కోర్కి సెప్ప నుచితమె కృష్ణా.[6]

81
  1. మహా...రాముఁడు = అధికమగు ప్రతిభాసంపత్తిచేత ఒప్పినవాఁడు (ప్రతిభ = సమయోచితస్ఫూర్తిగలబుద్ధి), పరమేష్టి = బ్రహ్మ, అగమ్యములు = తెలియరానివి, ఆగమోక్తఘనసూక్తులన్ = వేదమునందు చెప్పఁబడిన గురుత్వము గల మేలైన మాటలచేత, వికాసభాసి = తేటదనములేక ప్రకాశించువాఁడు.
  2. శ్రీవనితాకళత్ర = లక్ష్మీదేవి భార్యగాఁ గలవాఁడా, సరసీ... నేత్ర = కమలములను బోలినకన్నులుగలవాఁడా, భాగధేయావహ = భాగ్యమును పొందించువాఁడా, దివ్యరూప = దేవతామూర్తివైనవాఁడా, నిగమా...కలాప = వేదాంతరహస్యము లైనవిద్యలే అలంకారముగాఁ గలవాఁడా, నానా...భృంగ = పెక్కండ్రు ఉత్తమయోగులయొక్క నిర్మలమైన హృదయకమలములకు తుమ్మెదలైనవాఁడా, చిత్సుధా...సంగ = జ్ఞానామృతమున ముంచఁబడిన భక్తులయొక్క కూడికగలవాఁడా, నిరపాయగుణోన్నత = చెఱుపు లేనిగుణములచేత గొప్పవాఁడా.
  3. కాష్టగతాగ్ని = కట్టేయందలినిప్పు, కాష్ఠలన్ = దిక్కులయందు, యామినీ = రాత్రి, ఘటికా... కాష్ఠలు = గడియలు సంవత్సరములు కాష్ఠలు అనుకాలవిశేషములును.
  4. అగణితలీలన్ = ఎన్నరానివిలాసముతో, సమగ్రము = పూర్ణము, నెగడిన = అతిశయించిన, వేష్టితములు = చేష్టలు, దురాత్ములు = చెడ్డమనస్సుగలవారు.
  5. నటనలు = నడవళ్లు, చిత్రములు = వింతలు.
  6. సర్వాంతర్యామి = అంతట నిండి వర్తించువాఁడు, ఉర్వీధర = భూమిని ధరించినవాఁడా.