పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

ఓలోకేశ్వర చిత్తగింపుము ధ్రువుం డుత్తానపాదక్షమా
పాలశ్రేష్ఠునినందనుండు మిగులన్ బాలుండు నీభక్తుఁడై
యేలో కాని మహాతపోనిరతుఁ డై యిట్లున్నవాఁ డాతనిం
బోలంజాలరు తొంటితాపసులు మాబోంట్లున్ విరించాదులున్.[1]

61


తే.

చెక్కు మీటిన వస గాఱు శిశువుభక్తి, నుగ్రతప మాచరించుచు నున్నయతని
యతులతపము విఘ్నంబు సేయంగఁ బూని, పెక్కుమాయలు పన్నితి బెళుకు లేదు.[2]

62


చ.

అతులతపంబు పెంపున రమాధిప నీవలనన్ ధ్రువుండు దా
నమరపదంబుఁ గైకొనునో యంబుజమిత్రునిఁ బాఱఁదోలునో
హిమకరురాజ్య మేలునొ దిగీశులలో నొకఁడై చెలంగునో
ప్రమదముతోడఁ దానె మనుపట్ణములన్నియు నాక్రమించునో.[3]

63


వ.

అనిన నందకపాణి వజ్రపాణి కిట్లనియె.[4]

64


ఉ.

ఇంద్రపదంబుఁ గోరఁడు దిగీశులరాజ్యము లాసనేయఁ డా
చంద్రునికల్మిపై మనసుఁ జూఁపడు తా మును పంకజాప్తదై
త్యేంద్రులలోకముల్ దలఁపఁ డెన్నఁడు వీరికి లేనిమేలు రా
జేంద్రసుతుండు వేఱకటి యిచ్చఁ దలంచుట నే నెఱుంగుదున్.[5]

65


ఉ.

ఆతనికోర్కు లెల్లఁ బ్రియమారఁగ నిచ్చి తపంబు మాన్పెదన్
భీతిఁ దొఱంగి యుండు మని పెంపున నింద్రునిఁ బంచి భక్తలో
కాతిశయప్రమోదకరుఁ డైనముకుందుఁడు వచ్చెఁ జిన్మయో
పేతమనోరథుం డగునరేంద్రతనూజునిపాలి కున్నతిన్.[6]

66


సీ.

వారివాహముఁ బోలు వక్షస్స్థలంబున నిందిరాశంప పెంపొందుచుండ
భూమిపద్మమువంటిబొడ్డుదామరయందుఁ గమలజచంచరీకంబు మెఱయః
గల్పవృక్షంబుశాఖలమించుబాహుల నరిశంఖఫలయుగం బంద మొందఁ
బరిపూర్ణచంద్రుతో బ్రతివచ్చుమోమున దరహాసనవసుధాధార లొలుక

  1. చిత్తగింపుము = వినుము, ఏలో = ఏమిటికో.
  2. చెక్కు = చెక్కిలి, మీటినన్ = కొట్టినను, బెళుకు = చలనము.
  3. అమరపదము = దేవస్థానము, అంబుజమిత్రునిన్ = సూర్యుని, హిమకర = చంద్రునియొక్క, చెలంగున్ = విజృంభించునో, ప్రమదముతోడన్ = సంతోషముతో - ఉత్సాహముతో.
  4. నందకపాణి = విష్ణువు, వజ్రపాణి = ఇంద్రుఁడు.
  5. చాఁపఁడు= వ్యాపింపఁజేయఁడు, ఇచ్చన్= మనసునందు.
  6. తొణంగి = విడిచి, పంచి = పంపి, భక్త...కరుఁడు = భక్తులసమూహమునకు మిక్కుటమైనసంతోషమును కలుగఁజేయువాఁడు, చిన్మయోపేతమనోరథుఁడు = జ్ఞానస్వరూపముతోఁ గూడుకొన్న కోరికగలవాఁడు.