పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

నోముల్ పెక్కులు నోచి యుజ్జ్వలతపోనుష్ఠానకర్మంబు లు
ద్దామప్రీతి నొనర్చి సత్సుత్రునిఁ గాఁ దండ్రీ నినుం గాంచితిన్
నామాటల్ విను రాజ్యభోగములకు ర మ్మింక రాకుండినన్
నీమీఁదం బడి ప్రాణముల్ విడిచెద నిక్కంబుగా నిచ్చటన్.

55


మ.

అనుచుం దెంపుతలంపునన్ బలుక మాయామాతదుర్వాక్యముల్
వినఁగా నొల్లఁడు చూడ నొల్లఁడు మనోవీథిన్ వినోదించు న
వ్వనజాతామునిమూర్తియందు లయమై వర్తించుచిత్తంబుతో
నొనరన్ బాహ్యవివేకశూన్యుఁడు ధ్రువుం డుద్యచ్ఛిలారూపమై.[1]

56


వ.

అట్టిసమయంబున ననేకశస్త్రాస్త్రపాణులును భయంకరసింహనాదులును వికృతవే
షధారులును నైన రాక్షసు లనేకసహస్రసంఖ్యలు వచ్చి యబ్బాలునిం బొదివి
వెఱపించి యుద్ధతిఁ జూపిన నవియెల్లను భగవద్ధ్యానపరాయణుం డైనయౌత్తాన
పాదియందు దురాత్మునకుం జేసినయుపకారంబులుంబోలె విఫలంబు లగుటయు
నప్పుడు.[2]

57


ఉత్సాహ.

యామగణసమేతుఁడై మహాభయంబుతోడ సు
త్రాముఁ డప్పు డక్కుమారుతపముఁ జెఱుప నుపమ యొం
డేమియును నెఱుంగలేక హృదయతాప మగ్గలం
బై మునీంద్ర యావద్రాగినట్టికంటకంబునన్.[3]

58


క.

అతనితపోమహత్త్వము, శ్రీతరుణీశ్వరునితోడఁ జెప్పి యుడుపలే
కీతఱి నుపేక్ష సేసిన, భూతగణంబులకు హాని పుట్టు నటంచున్.[4]

59


మ.

చని వైకుంఠమునందు మందరధరుం జంద్రార్కనేత్రున్ సురా
వనకేళిరతు నంబురాశితనయావక్షోజకుంభోపగూ
హనబాహాపరిశోభితుం గని తదీయశ్రీపదాంభోరుహా
వనతోదంచితమస్తకుం డగుచు దేవస్వామి దా నిట్లనున్.[5]

60
  1. తెంపుతలంపునన్ = తెగువ గలతలపుతో, లయమై = ఐక్యమై, బాహ్యవివేకశూన్యుఁడు = బయటితెలివి లేనివాఁడు - ప్రపంచజ్ఞానము లేనివాఁ డనుట.
  2. శస్త్రాస్త్రపాణులు = శస్త్రములును అస్త్రములును చేతులయందు గలవారు (శస్త్రము = కత్తి మొదలైనది, అస్త్రము = మంత్రపూతమైన బ్రహ్మాస్త్రము మొదలగునది), పొదివి = చుట్టుకొని, ఔత్తానపాది = ఉత్తానపాదుని కొడుకు, దురాత్మునకు = దుష్టస్వభావము కలవానికి.
  3. సుత్రాముఁడు = ఇంద్రుఁడు, ఉపమ = ఉపాయము, ఒండు = అన్యము, అగ్గలంబు = అధికము, కంటకంబునన్ = సంకటముతో.
  4. శ్రీతరుణీశ్వరుఁడు = లక్ష్మీపతి - విష్ణువు, ఉడుపలేక = మాన్పలేక.
  5. సురావనకేళిరతున్ = దేవతలను రక్షించుట యనెడు క్రీడయందు ఆసక్తుఁడైనవానిని, అంబురాశి...శోభితున్ = లక్ష్మీదేవియొక్క కుచకలశములను ఆలింగనము చేసికొనెడు చేతులచే ప్రకాశించువాఁడు, తదీయ...మస్తకుఁడు = అతనిదైన పూజ్యమైన పాదకమలములయందు (సోఁకునట్లు) వంపఁబడిన తల కలవాఁడు, దేవస్వామి = దేవేంద్రుఁడు.