పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

వదనముల మంట లొలుకంగ ముదిసినట్టి, జంబుకంబులు కొఱవిదయ్యంబులట్లు
బెట్టురాత్రులఁ గూఁతలు పెట్టుచుండు, నవిరళధ్యానపరుఁ డైనధ్రువునికడను.[1]

48


వ.

ఇ ట్లనేకవిధంబులం దపోవిఘ్నంబు సేయునెడ నొక్కనాఁ డొక్కమాయావి
యైన రాక్షసి సునీతిరూపంబు గైకొని యతనిపాలికి వచ్చి బాష్పపూరితలోచ
నయై గద్దదస్వరంబున నిట్లనియె.[2]

49


ఉ.

అన్న కుమారచంద్ర తగునయ్య నిరంతరదుఃఖవార్ధిలో
న న్నిటు ముంచి యీవిధమున భయదాటవులం దపంబు సే
య న్నడతెంచి తిట్టినిను నన్యులు మెత్తురె పిన్నబిడ్డలన్
వెన్నుఁడు మెచ్చి యెన్నఁ డొసవెన్ వరముల్ నినువంటివారికిన్.[3]

50


ఉ.

అందనిపంటి కేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు విష్ణుఁ డున్నయా
కందువచందమామగుటకల్ విను మీపని గట్టిపెట్టి నా
డెందములోనియుమ్మలిక డిందుపడం జనుదెమ్ము పోద మిం
పొంద సమస్తభోగములఁ బొందెడుతండ్రికి వేడ్క సేయఁగన్.[4]

51


శా.

ఆరం బండినపైరు వోవిడిచి దుర్వ్యాపారచిత్తంబుతో
ఘోరారణ్యములోన మోడు నఱకన్ గొడ్డండ్లు సేయించిన
ట్లీరాజ్యంబు సమస్తమున్ విడిచి నీ వేలా తపోనిష్ఠకుం
జేరన్ వచ్చితి భావికాలఫలముల్ చింతించి సత్పుత్రకా.[5]

52


శా.

బాలక్రీడలఁ దల్లిదండ్రుల నదభ్రప్రీతి నొందించి యి
చ్ఛాలంకారవిహారముల్ సలిపి పూజ్యం బైనరాజ్యస్థితుల్
చాలం గైకొని వార్ధకంబునఁ దపస్సంపత్తిఁ గైకొంట గా
కేలా దేహము దుఃఖపెట్టెదవు తండ్రీ చిన్నిప్రాయంబునన్.[6]

53


ఉ.

దట్టపులజ్జతో సవతితల్లి దురుక్తులు నెమ్మనంబునం
బెట్టి విరక్తి పుట్టి పటుభీషణవృత్తిఁ జరింపనేల నీ
కిట్టిచలంబు చాలఁ గలదేని మహీతలమెల్ల నేలఁగాఁ
బట్టముఁ గట్టు నేర్పున కుపాయ మెఱింగితి రమ్ము పుత్రకా.[7]

54
  1. చటుల...భుజంగంబులై = వాఁడియైన కోఱలవలని విషపుమంటలచేత విశాలముఖము గలిగిన భయంకరములైన పాములై, కేసరి...రూపంబులై = సింహము పులి పంది గండభేరుండము వీనియొక్క రూపములు గలవై, పొడచూపుచుండున్ = కనఁబడుచుండును, దైత్య...తోడన్ = రాక్షసులు పిశాచములు భూతములు ప్రేతములు డాకినులు వీనియొక్క కూఁతలతో, సందడించున్ = సందడిని కలుగఁజేయును, చిటచిటార్భట...కీలలన్ = చిటచిటయను ధ్వనితో చక్కగా వెలుఁగుతున్న కార్చిచ్చుమంటలచేత, క్రొమ్మంటులు = క్రొత్తమంటలు, ఓలిన్ = వరుసగా, పోదువున్ = క్రముకొనును, వదనములన్ = ముఖములందు, బెట్టు = భయంకరముగా, అవిరళధ్యానపరుఁడు = ఎడతెగని ధ్యానసమాధియందు ఆసక్తుఁడు.
  2. బాష్పపూరితలోచన = కన్నీళ్లచే నిండిన కన్నులు గలది, గద్గద = డగ్గుత్తిక గల.
  3. నడతెంచితి = నడచితివి - వచ్చితివి, ఒసవెన్ = ఒసఁగెను - ఇచ్చెను.
  4. పంటికిన్ = పండునకు, అఱ్ఱు = మెడ, నిగిడ్చెదు. = చాఁచెదవు, కందువ = స్థానము, చందమామగుటకలు = పొందరానిదనుట, కట్టిపెట్టి = మానుకొని, ఉమ్మలిక = దుఃఖము, డిందుపడన్ = అడఁగ.
  5. ఆరన్ = పూర్ణముగా - చక్కగా, మోడు = మోటు, భావికాలఫలములు = రాఁగలకాలఁపు ప్రయోజనములు.
  6. అదభ్రము = సార్థకము, చాలన్ = తృప్తిగా, వార్ధకంబునన్ = ముదిమియందు, గైకొంట = కైకొనుట - గ్రహించుట.
  7. దట్టపు = అధికమైన, దురుక్తులు = చెడ్డమాటలు, భీషణవృత్తిన్ = భయంకరవ్యాపారముతో, చరింపన్ = మెలఁగ.