పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నవ్వాసుదేవునకుం దపంబుఁ జేసి కాదె కృతార్థులై మహనీయమహిమం బడసిరి.
అస్మదాదు లైనమహామునులును నద్దేవు నుపాసించి కాదె జగంబుల నందఱి
కంటే నధికుల మైతిమి. కావున నీవును భక్తరక్షణపరాయణుం డైన నారా
యణు నారాధింపు మతండు నీకు నభీష్టఫలంబు నిచ్చునని విధివంతంబుగా నత
నికి ద్వాదశాక్షరమంత్రం బుపదేశించి తపశ్చరణప్రకారంబునుం జెప్పి కృతా
ర్థుండవు గమ్మనిన నౌత్తానపాదియుం బ్రమోదభరితహృదయుండై యచ్చోటు
గదలి చని.[1]

37


సీ.

ఆదికాలంబున యమునాతటంబున మధుఁ డనుదానవుం డధికతపముఁ
గావించి యిందిరాకాంతుఁ బ్రత్యక్షంబు చేసి యాత్మీయనివాసభూమి
యైనయావనభూమియందు నానాదేవయుక్తుఁడై యద్దేవుఁ డుండునట్లు
గా వర మర్థితోఁ గైకొని తనపేర మధురాపురంబును మధువనంబు


తే.

ననఁగ లోకప్రసిద్ధిగా నలవరించె, సార్వకాలంబు పద్మలోచనుఁడు సకల
సురగణంబులు గొలువ నచ్చోట నుండు, నది తపోధనులకు నెల్ల నాస్పదంబు.[2]

38


ఆ.

ఆకుమారచంద్రుఁ డచ్చోటు దనకుఁ ద, పంబు సేయఁదగినపట్టు గాఁగ
నిశ్చయంబు సేసి నిష్ఠతోఁ గాళింది, యందుఁ దీర్థమాడి యభిమతముగ.[3]

39


క.

ఔత్తానపాది మునినా, థోత్తము లెఱిఁగించినట్టియుపదేశవిధిన్
జిత్తంబు యోగవిద్యా, యత్తంబై చెంగలింప నప్పుడు కడఁకన్.[4]

40


తే.

షోడశాబ్దవయోమూర్తి సుందరాంగు, శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గహస్తుఁ
బీతకౌశేయు లక్ష్మీసమేతవక్షు, నాదిదేవుని విష్ణుని నాత్మఁ దలఁచి.[5]

41


క.

బాలకుఁడు బ్రహ్మవిద్యా, శీలుండై చిత్సుధాభిషేచనమతితో
లోలోనిచవుల మిక్కిలి, లోలుండై బాహ్యరుచులు లోఁ గొనకుండెన్.[6]

42


చ.

ముదమున సర్వలోకములు మోచి వెలింగెడి వాసుదేవునిన్

  1. అవ్వాసుదేవునకున్ = ప్రసిద్ధుఁడైన శ్రీహరినిగూర్చి, అస్మదాదులు = మేము మొదలైనవారు, ఉపాసించి = సేవించి, భక్తరక్షణపరాయణుండు = భక్తులను రక్షించుటయందు ఆసక్తుఁడు, ఆరాధింపుము = అర్పింపుము, విధివంతంబుగాన్ = శాస్త్రమునందు చెప్పినక్రమముతో కూడుకొనునట్టుగా, తపశ్చరణప్రకారంబు = తపస్సు చేయువిధము, ఔత్తానపాది = ఉత్తానపాదునికొడుకు - ధ్రువుఁడు, ప్రమోదభరితహృదయుఁడు = సంతోషముతో నిండుకొన్న మనస్సు కలవాఁడు.
  2. అర్థితోన్ = ప్రియముతో, అలవరించెన్ = చేసెను, సార్వకాలంబు = ఎల్లకాలము, ఆస్పదము = స్థానము.
  3. పట్టు = స్థానము, కాళిందియందున్ = యమునానదియందు, తీర్ధమాడి = స్నానము చేసి.
  4. చెంగలింపన్ = అతిశయింపఁగా.
  5. షోడశాబ్దవయోమూర్తిన్ = పదియాఱేండ్లవయస్సుగల ఆకృతిగలవానిని, పీఠకౌశేయున్ = పచ్చపట్టువస్త్రము ధరించినవానిని.
  6. చిత్సుధాభిషేచనమతితోన్ = జ్ఞానామృతమున మునుఁగుతలఁపుతో, లోలోనిచవులన్ = తనయందలి జ్ఞానామృతరుచులయందు - జ్ఞానానుభవమునందు, లోలుండు = ఆసక్తుఁడు, బాహ్యరుచులు = బయటిచవులు - భక్ష్యభోజ్యాదుబవలని చవు లనుట, లోఁగొనక = గ్రహింపక.