పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే.

నాలుగైదువత్సరముల బాలకుఁడవు, మోహనం బైనసుకుమారమూర్తి వీవు
లేశమాత్రంబు వ్యాధులు లేవు మేనఁ, దల్లిదండ్రులు గల్గినధన్యమతివి.[1]

29


క.

నీ వెక్కడఁ దప మెక్కడ, భావిశుభ శ్రీదమైనఫల మెక్కడ నీ
వీవెఱ్ఱిపడుచుబుద్ధులు, పోవిడువుము వేగ మగిడిపొమ్ము కుమారా.[2]

30


చ.

అనిన ధ్రువుండు వారలకు నంజలి చేసి వివేకబుద్ధితో
జనకుని సమ్ముఖమ్మున విచారవివేకము లేశమాత్రముం
దనమది లేక యాసవతితల్లి దురాగ్రహవృత్తితోడఁ బ
ల్కినకొఱగానిమాటలు నికృష్టతయున్ వినిపించి వెండియున్.[3]

31


క.

ఏనింక నట్టిచోటికిఁ, బోనొల్లను మీప్రసాదమునఁ బుణ్యతప
శ్రీ నొంది మిగులనున్నత, మైనపదంబున వసింతు నని పలుకుటయున్.[4]

32


తే.

అతనిదృఢనిశ్చయంబును నతనిసద్వి, వేకబుద్ధియు నతనియస్తోకమహిమ
యును గనుంగొని యమ్మహామునివరేణ్యు, లందఱును దమలోన నిట్లనిరి నగుచు.[5]

33


చ.

అనిమొన ముట్టి శాత్రవచయంబులు దారుణదివ్యబాణముల్
ఘనముగ నేయఁగాఁ దనువు గాఁడిన నొవ్వఁడు గాని రాజనం
దనుఁ డవమానపూర్వకవిధానము లైనదురుక్తు లిమ్మెయిన్
మనమున నాట నన్న నొకమాటకు నోర్వఁడు వేయుఁ జెప్పినన్.[6]

34


వ.

అని పలికి యతని నవలోకించి.

35


ఉ.

నీమది నిట్టిపాటిదృఢనిశ్చయ మొందెనెయేని భక్తితోఁ
దామరసాయతాక్షు వినతాసుతవాహను భక్తలోకచిం
తామణి భుక్తిముక్తిఫలదాయకు సర్వసుపర్వనాయకున్
శ్రీమహిళాకళత్రుని భజింపు కుమారక యిష్టసిద్ధికిన్.[7]

36


వ.

తొల్లి మీవంశకర్త లైనస్వాయంభువుండును బ్రియవ్రతోత్తానపాదులును

  1. మోహనము = మోహింపఁజేయునది.
  2. భావిశుభశ్రీదము = ఇకమీఁద శుభమును సంవదను ఇచ్చునది, ఈ వెఱ్ఱిపడుచుబుద్ధులు = ఈపిచ్చితనపుపసివానిబుద్ధులు.
  3. అంజలి = చేమోడ్పు, దురాగ్రహవృత్తితోడన్ = చెడ్డకోపవ్యాపారముతో, కొఱగానిమాటలం = పనికిమాలిన మాటలు - నీచపు మాటలు, నికృష్టత = (తన)నీచత్వము.
  4. పదంబునన్ = స్థానమునందు.
  5. అస్తోకమహిమ = గొప్పమహత్వము.
  6. శాత్రవచయంబులు = శత్రుసమూహములు, దారుణదివ్యబాణములు = భయంకరములును అమోఘములు నైనబాణములు, ఘనముగ = దట్టముగా, కాఁడినన్ = నాటినను, దురుక్తులు = చెడ్డమాటలు, ఓర్వఁడు = సహింపఁడు.
  7. ఇట్టిపాటన్ = ఈ విధముగా, వినతాసుతవాహనున్ = గరుడవాహనుని, భుక్తిముక్తిఫలదాయకున్ = భుక్తి ముక్తి ఫలములను ఇచ్చువానిని (భుక్తి = ఈలోకమునందలి అనుభవము, ముక్తి = మోక్షము),
    సర్వసుపర్వనాయకున్ = ఎల్లదేవతలకు అధిపతియైనవానిని, శ్రీమహిళాకళత్రుని = లక్ష్మీదేవి భార్యగాఁ గలవానిని, భజింపు = సేవింపుము.