పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గలఁడు తత్తనూజు గారవింపక యేల, మాను నంతచనువు మాకుఁ గలదె.[1]

18


తే.

సురుచి సౌభాగ్యవతి గాన సుతుఁడుఁ దాను, మునుజనాథునివలన మన్ననలు గనిరి
మందభాగ్యుల మైనట్టిమనకు నేల, మనుజనాథునివలన మన్ననలు గలుగు.[2]

19


చ.

పుడమి సమస్తమున్ సురుచిపుత్రకుఁ డేలుచు రాజుమన్ననల్
వడసి మహోన్నతాసనముపై విలసిల్లఁగ వానిపాదముల్
విడువక గొల్చుచుం గృపణవృత్తి కొడంబడ నున్నయన్న నా
కడుపున నేల పుట్టితివి కష్టపుఁబాటునకై తనూభవా.[3]

20


వ.

అని యెలుంగెత్తి యేడ్చిన తల్లి నూరార్చి ధ్రువుం డిట్లనియె.

21


ఉ.

ఏమిటి కింతదుఃఖమున నేడ్చెద వుత్తమలీల నుత్తముం
డీమహనీయభూవలయ మేలుచు రాజ్యము సేయనిమ్ము త
ల్లీ మనుజేంద్రుఁ డిట్టిసిరి యెవ్వరిచే మును గాంచె నవ్విభుం
డేమియను గ్రహించి మన కీఁడొకొ యీపరిపాటిసంపదల్.[4]

22


ఉ.

తండ్రి ప్రియవ్రతానుజునిదత్తము లైనసమస్తధారుణీ
మండలభోగముల్ నిమిషమాత్రసుఖంబులు గాన నిందు నే
నుండఁగనొల్ల వేల్పులకు నున్నతమైనపదంబునందు నే
నుండెదఁ జంద్రసూర్యులు పయోనిధులుం గలకాల మెప్పుడున్.

23


ఆ.

ఏను దపము సేయ నేగేద నెమ్మది, నుండు మనుచుఁ దల్లి నూఱడించి
పలికి యొక్కరుండు పరమనిర్వేదన, పరుఁడు రాజసుతుఁడు పురము వెడలె.[5]

24


వ.

ఇట్లు పురంబు నిర్గమించునప్పుడు తదీయసమీపోద్యానవనమధ్యంబునఁ గృష్ణా
జినంబులు విష్టరంబులుగా నిడి కూర్చున్న సప్తమహర్షులం బొడగాంచి నమస్క
రించి యున్న యన్నరేంద్రనందనునకు నమ్మునీంద్రు లిట్లనిరి.[6]

25


ఆ.

ఎందునుండి వచ్చి తెవ్వరివాఁడవు, తెలియఁ జెప్పు నామధేయ మేమి
యిప్పు డొంటి నేల నీ విచ్చటికి వచ్చి, తనిన మునులతోడ నాతఁ డనియె.

26


తే.

ఏను ధ్రువుఁ డనువాఁడ నుత్తానపాదు, నాత్మజుండఁ దపంబు సేయంగఁ గోరి
పోవుచున్నాఁడ నాతొంటిపుణ్యఫలము, కతన మీదర్శనము నాకుఁ గలిగె ననిన.

27


క.

మునులందఱు నాశ్చర్యం, బున నాతనిఁ జూచి రాజ్యభోగ్యములుం గై
కొననొల్లక నిర్వేదిం, చినకారణ మేమి యిట్లు చెల్లునె నీకున్.[7]

28
  1. అన్న = నాయనా - ఇది ప్రేమసంబోధనము, నిక్కంబులు = నిశ్చయములు, ప్రియముగలఁడు = ప్రియముకలవాఁడు, చనువు = స్వాతంత్ర్యము.
  2. సౌభాగ్యవతి = మంచియదృష్టముగలది, మన్ననలు = సన్మానములు, కనిరి = పొందిరి, మందభాగ్యులము = భాగ్యహీనులము.
  3. మహోన్నతాసనము = మిక్కిలి యెత్తైనపీఠము, కృవణవృత్తికిన్ = నికృష్టవ్యాపారమునకు.
  4. మహనీయము = గొప్పది, సిరి = సంపద, ఈపరిపాటి = ఈమాత్రము.
  5. నెమ్మదిన్ = కొఱఁతలేని మనస్సుతో, ఊఱడించి పలికి = దుఃఖము చల్లారునట్టి మాటలు చెప్పి, పరమనిర్వేదనపరుఁడు = మిక్కిలి విచారము చేతనైన త్రొక్కుట కలవాఁడు.
  6. విష్టరంబులు = ఆసనములు.
  7. కైకొననొల్లక = గ్రహింప నపేక్షింపక, నిర్వేదించిన కారణము = నిర్వేదమునొందిన నిమిత్తము.